హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, ఆందోళనలతో ఆదివారం అసెంబ్లీ అట్టుడికింది. ‘పొంగులేటి కాదు.. పొంగు‘లూటీ’.. ‘మంత్రుల అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి’.. ‘రక్షకుడే భక్షకుడైతే ప్రజలకు దిక్కెవరు?’.. ‘అక్రమాల ఘనాపాటి మంత్రి పొంగులేటి’.. అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ సభ్యులు చేసిన నినాదాలతో సభ దద్దరిల్లింది. ‘తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత’ అన్న బిల్లుపై ఆదివారం శాసనసభలో చర్చ సందర్భంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై సభా సంఘం (హౌస్ కమిటీ) వేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ పోడియం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని, మైనింగ్ వ్యవహారంలో హౌస్ కమిటీ వేయాలన్న డిమాండ్లతో చప్పట్లు కొడుతూ, నినాదాలు చేస్తూ సభలో నిల్చొని ఆందోళన కొనసాగించారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున మార్షల్స్ స్పీకర్ పోడియం వద్ద మోహరించారు. వెల్‌లోకి వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ నెట్టివేశారు. మార్షల్స్ తీరుతో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇతర బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, అనిల్ జాదవ్, కౌశిక్‌రెడ్డి నేలపై కూర్చొని నిరసన తెలిపారు.
హౌస్ కమిటీ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చేసిన ప్రకటనకు విరుద్ధంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. హౌస్ కమిటీ ఆరోపణలున్న శాఖలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు మాత్రమే చేస్తుందని మంత్రులు వివరించారు. హౌస్ కమిటీకి చర్యలు తీసుకొనే అధికారాలు లేవని వారు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఇందుకు భిన్నంగా బాలానగర్ భూ బదలాయింపులపై హౌస్ కమిటీ వేసేందుకు సిద్ధమని అసెంబ్లీలో ప్రకటించడం గందరగోళానికి దారితీసింది. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో భూ బదలాయింపులపై హౌస్ కమిటీ ప్రతిపాదనను లేవనెత్తగా.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ప్రభుత్వం శాసనసభలో మాట్లాడించడం గమనార్హం. ఈ సందర్భంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ బదలాయింపులపై సీఎం సూచన మేరకు హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరిని ఉద్దేశించి నాలుగు పార్టీలు మారారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కడియం శ్రీహరి చోర్ అంటూ పాడి కౌశిక్‌రెడ్డి సహా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మె ల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారు.
కడియం శ్రీహరి శాసనసభలో మాట్లాడుతుండగా పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ‘రారా చూసుకుందాం.. అంటూ కౌశిక్‌రెడ్డిని ఉద్దేశిం చి కాంగ్రెస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు బెదిరింపులకు దిగారు. ఆయన వెంటే మరికొంత మంది కడియం వద్దకు చేరుకొని కౌశిక్‌రెడ్డిపై తీవ్ర పరుష పదజాలంతో దూషణలకు దిగారు. అసెంబ్లీకి కౌశిక్‌రెడ్డి ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకొస్తున్నారంటూ సంబంధం లేకుండా నాగరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కౌశిక్‌రెడ్డి దురహంకారంతో మాట్లాడుతున్నారంటూ అక్కసు వెల్లగక్కారు.
స్పీకర్ కడియం శ్రీహరి అంశంపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డిపై తీవ్రస్వరంతో బెదిరింపులకు దిగారు. కడియం శ్రీహరిని దూషిస్తే ‘కత్తుల కోలాటం ఆడుతాం.. బిడ్డా ఖబడ్దార్’ ఏమనుకుంటున్నావ్.. అంటూ హెచ్చరించారు. మా పనికత్తులు లేస్తే గడికి వేలాడదీస్తామంటూ అసెంబ్లీలో తీవ్ర పదజాలంతో బెదిరింపులకు దిగారు.
కడియం శ్రీహరి అంశంపైనే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వగా, ఆయన ఆవేశంతో ఊగిపోయారు. ‘ఆనాడే మా సీతక్క తుపాకీ పట్టింది’ అంటూ కౌశిక్‌రెడ్డిని హెచ్చరించారు. పేపర్లో ఫ్రంట్ పేజీలో రావాలని నిరసన తెలుపుతున్నారంటూ ఆరోపించారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మీ అందరినీ ‘బొక్కలో వేసి తొక్కుతాం’ అంటూ బెదిరింపులకు దిగారు.
పాడి కౌశిక్‌రెడ్డి ‘అసెంబ్లీ నక్సలైట్’ అంటూ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రిని టార్గెట్ చేసి బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతున్నారని, ప్రభుత్వంపై పైచేయి సాధించేందుకు నిరసన తెలుపుతున్నారని ఆరోపించారు. అధికారంలో లేకపోయినా తాము చెప్పినట్టే వినాలనేలా బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.