హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. గురువారం ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించి, ఓదార్చారు. వారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. ప్రమాద ఘటన దురదృష్టకరమని, మృతుల ఆత్మకు శాంతి చేకూరాని ప్రార్థించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇప్పటికే పార్టీ బృందం సౌదీ వెళ్లిందని, పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
మృతదేహాల తరలింపు, ఇతర ఏమైనా సమస్యల పరిష్కారానికి విదేశాంగ అధికారులతో స్వయంగా మాట్లాడుతామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీజీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్, యువ నాయకుడు ముఠా జైసింహ తదితరులు పాల్గొన్నారు.