తాండూరు, నవంబర్ 23 : లగచర్ల ఘటనకు కాంగ్రెసోళ్లే బాధ్యులని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శుభప్రద్ పటేల్ ఆరోపించారు. ఈ ఘటనలో 12 మంది అధికార పార్టీ నాయకులే ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రోద్బలంతోనే ఈ ఘటన జరిగినట్టు ప్రభుత్వం కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు. శనివారం ఆయన వికారాబాద్ జిల్లా తాండూరులో మీడియాతో మాట్లాడారు. ఫార్మా విలేజ్లంటూ దుద్యాల మండలంలో భూములు సేకరించడం దారుణమని అన్నారు.
లగచర్ల, హకీంపేట్, పోలపల్లి, రోటిబండ తండా, పులిచెర్ల తండాలకు సంబంధించి పెద్ద ఎత్తున భూములను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని అన్నారు. తాము భూములు ఇవ్వలేమని స్థానిక రైతులు ఎన్నోసార్లు అధికారులతో మొరపెట్టుకున్నా, ధర్నాలు, పాదయాత్రలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే రైతులు తిరగబడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో 3 కేసులను నమోదు కాగా అందులో ఒక్క కేసులోనే 46 మందిని నిందితులుగా పేర్కొన్నారని తెలిపారు.
ఇందులో 12 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కూడా ఉన్నట్టు చెప్పారు. మీడియా సాక్షిగా అందులో సీఎం రేవంత్రెడ్డి, తిరుపతిరెడ్డితో సన్నిహితంగా ఉన్న రామూనాయక్, నాగుల హన్మంతు ఇలాచాలా మందిని గుర్తించినట్టు తెలిపారు. అయినప్పటికి వారిని ఇప్పటివరకు అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. 46 మంది నిందితుల్లో బీజేపీ వారు కూడా ఉన్నట్టు తెలిపారు. ఒక్క సురేశ్ అనే వ్యక్తిని చూపించి మొత్తం బీఆర్ఎస్ పార్టీ కుట్ర పన్నిందని చెప్పడం సమంజసం కాదని అన్నారు.