ఖమ్మం రూరల్, జూలై 6: తెలంగాణలో యూనివర్సిటీలకు, ఎయిర్‌పోర్టులకు, ప్రభుత్వ పథకాలకు గాంధీల పేర్లు ఎందుకు పెడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఆ పేర్లను వెంటనే తొలగించి, తెలంగాణ కవులు, రచయితలు, మేధావుల పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. నాటి బీఆర్ఎస్ సర్కార్ రైతులకు ఎలాంటి మేలు చేసిందో వివరించేందుకు కేటీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించి చర్చకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఏదులాపురంలోని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
నాటి బీఆర్ఎస్ సర్కారు అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసి ప్రక్రియను పూర్తి చేస్తే.. ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ సర్కారు ఆ ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకొని పబ్బం గడుపుకొంటుందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పాలనంతా అబద్ధాల పునాదులపైనే కొనసాగుతున్నదని రాకేశ్‌రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 420 అబద్ధపు హామీలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే హామీలను తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా జిల్లాకు చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు.