రాయికల్, మే 25 : ప్రజా పాలన అంటే.. ధాన్యం కొనకుండా రైతులను గోస పెట్టుడేనా? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధాన్యం అమ్ముకోవాలంటే ఎన్నడూ లేనివిధంగా రైతులు నడిరోడ్డుపై యుద్ధం చేయాల్సి దుస్థితి వచ్చిందని వాపోయారు. ప్రభుత్వం బాధ్యతతో వరి, మక్కతోపాటు ఏ పంటైనా కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టంచేశారు. మక్క కొనుగోళ్లు వేగవంతం చేయాలని, ధాన్యాన్ని వెనువెంటనే తరలించాలని, ధాన్యం డబ్బులను సత్వరమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జగిత్యాల జిల్లా రాయికల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేయగా, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి జీవన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం రైతులతో కలిసి మండుటెండలోనే బైఠాయించారు.
జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ తీరుపై ధ్వజమెత్తారు. రైతులు 40 క్వింటాళ్ల ధాన్యం పండిస్తే ప్రభుత్వం కేవలం 25 క్వింటాళ్లే కొంటామంటే మిగిలిన 15 క్వింటాళ్లు ఎకడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. ఈ క్రమంలో రైతులు దళారులను ఆశ్రయించి తకువ ధరకు అమ్ముకొని నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కొన్ని రోజులు ఓపిక పడితే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు రైతులకు సమస్యలు ఉండవని చెప్పారు. తాను పండించిన ధాన్యం కూడా ఇరువై రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నదని, కొనేదిక్కు లేదని మండిపడ్డారు. అనంతరం జీవన్‌రెడ్డి రెవెన్యూ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ, మక్కలు కొన్న తర్వాత బ్యాగులను వెంటనే మిల్లులకు తరలించాలని, పెండింగ్‌లో ఉన్న ధాన్యం డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.