Local Body Elections | హైదరాబాద్, మార్చి 13 (నమస్తేతెలంగాణ): స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార కాంగ్రెస్ పార్టీకి పెండింగ్ బిల్లుల గండం పొంచి ఉన్నది. పంచాయతీ పాలన ముగిసి 14 నెలలు గడుస్తున్నా, పెండింగ్‌లో ఉన్న రూ.691.93 కోట్ల బిల్లల చెల్లింపు విషయంలో సర్కార్ తీవ్ర జాప్యం చేస్తూ వస్తున్నది. దీంతో 14 నెలలుగా తాజామాజీ సర్పంచులు పోరుబాట పట్టారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారంతా ఆగ్రహంతో ఉన్నారు.
ఈ దశలో ఎన్నికలు జరిగితే పెండింగ్ బిల్లులు చెల్లించని కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావం పడనున్నది. సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ, జేఏసీ నేతలు అనేకసార్లు సీఎం, ఇతర మంత్రులను కలిసి పెండింగ్ బిల్లుల విషయాన్ని విన్నవించినా పెడచెవిన పెట్టారని తాజా మాజీ సర్పంచులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వినతిపత్రాలు ఇచ్చిన స్పందన కరువైందని, శాంతియుత నిరసనలు చేపడితే పట్టించుకోనేలేదని, పోరాటాలు చేస్తే అరెస్టులు చేశారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అప్పుడు ఇప్పుడు అంటూ దాటవేస్తున్నారే తప్ప బిల్లులు మాత్రం ఇవ్వడమేలేదని చెప్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాజీ సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,848 సర్పంచ్ పదవులు, 5,817 ఎంపీటీసీ స్థానాలు, 578 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.
సర్పంచులుగా ఎన్నికైనవారు సొంత డబ్బులు సైతం వెచ్చించి గ్రామాల్లో అనేక పనులు చేపడుతుంటారు. ఆ పనులే ఎజెండాగా తదుపరి ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. గ్రామ పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో 70 శాతానికిపైగా మాజీ ప్రజాప్రతినిధులే మళ్లీ పోటీ చేస్తుంటారు. ప్రస్తుతం ఉన్న 12,848 స్థానాల్లో సుమారు 8,000 స్థానాల్లో పాతవారే పోటీచేసే అవకాశం ఉంటుది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తున్నది. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో వారిపై అప్పులభారం పెరిగింది.
ఈ పరిస్థితుల్లో ఎన్నికల బరిలోకి దిగేందుకు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. హామీ ఇచ్చి మోసం చేసిన అధికార పార్టీపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. బిల్లులు అడిగితే అరెస్టులు చేసిన విషయాన్ని మరిచిపోలేమని గుర్రుగా ఉన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తామని బాహాటంగానే చెప్తున్నరు. రాష్ట్ర సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ దిశగా కార్యాచరణ రూపొందించేందుకు సన్నద్ధమవుతున్నారు.
పంచాయతీల్లో చేసిన పనుల పెండింగ్ బిల్లుల కోసం అరిగోస పడుతున్నం. మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగి అలిసిపోయినం. అనేకసార్లు నిరసన తెలిపినా ఫలితం రాలేదు. ఇప్పటివరకూ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటనే చేయడం లేదు. బడా బడా కాంట్రాక్టర్లకు వేల కోట్లను అప్పనంగా కట్టబెడుతున్న ప్రభుత్వం.. పల్లెల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా మోసం చేసింది. దగా చేసిన కాంగ్రెస్‌ను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టం. వచ్చే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్తాం.
– సుర్వి యాదయ్యగౌడ్, సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు