రాష్ట్రంలో ఆర్ఎస్ బ్రదర్స్(రేవంత్‌రెడ్డి- బండి సంజయ్) గుట్టు మరోసారి బయటపడిందని బీఆర్ఎస్ సోషల్‌మీడియా కన్వీనర్ వై.సతీశ్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో మోడీతో కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తోంటే.. తెలంగాణలో మాత్రం ఆ రెండు పార్టీలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయని విమర్శించారు. ఒకరికి ఒకరు తోడూ నీడగా, ఒకరిపై ఈగ వాలకుండా మరొకరు జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు.
రాష్ట్రంలో ప్రజాసమస్యలపై కేటీఆర్ పాదయాత్ర చేస్తానంటే.. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే ముందే బండి సంజయ్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని వై.సతీశ్‌రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వ నిర్వాకం బయటపడి, ఆయనకు ఇబ్బంది వస్తుందని సంజయ్ బాధపడుతున్నట్టే కనిపిస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.. కేటీఆర్ పాదయాత్రపై వాళ్లు మొదట స్పందించాలి. కానీ అందరికంటే ముందే బండి సంజయ్ ఎందుకు స్పందిస్తున్నారని నిలదీశారు. రేవంత్ సర్కారుకు చిన్న ఇబ్బంది వచ్చినా.. బండి సంజయ్ ఓర్చుకోవడం లేదన్నారు. అంటే ఇది ఆర్ఎస్ బ్రదర్స్ మధ్య ఉన్న అవినాభావ సంబంధమని ఎద్దేవా చేశారు
కేటీఆర్‌తో పాటు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ రాష్ట్రమంతటా పాదయాత్ర చేయాలని వై.సతీశ్‌రెడ్డి సూచించారు. అప్పుడే ప్రజల స్పందన ఏంటో మీకు తెలుస్తుందని అన్నారు. 420 హామీలిచ్చిన కాంగ్రెస్ పై, వాటి గురించి, ప్రజల సమస్యల గురించి కనీసం మాట్లాడని బీజేపీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు RS Brothers ఇద్దరూ కలిసి మోకాళ్ల యాత్ర చేసినా ఇప్పుడు ఇద్దరికి డిపాజిట్లు కూడా రావని విమర్శించారు.ఆర్ఎస్ బ్రదర్స్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా తెలుస్తుందని అన్నారు. అంతేగానీ.. ఇలా రేవంత్, సంజయ్ చెట్టాపట్టాలేసుకుని దాగుడుమూతలు ఆడుతూ, ప్రజల కళ్లకు గంతలు కడదామని చూస్తే.. నమ్మడానికి ప్రజలు ఏం అమాయకులు కాదని అన్నారు.