హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ‘రైతులను నిండా ముంచి రైతు పండుగ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి గప్పాలు కొడుతున్నారు.. ఏడాది పాలనలో రూ.63 వేల కోట్ల మోసం చేశారు’ అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఏడాది పాలనలో రైతులను నిండా ముంచిన కాంగ్రెస్ సర్కార్ రూ. 54 వేల కోట్లు ఖర్చు పెట్టామని ప్రచా రం చేసుకోవడం విడ్డూరమని, రుణమాఫీ కింద రూ.40 వేల కోట్లకు గాను రూ.18 వేల కోట్లే మాఫీ చేసి రూ. 22 కోట్లు ఎగ్గొట్టిందని విమర్శించారు. రైతు భరోసా కింద రూ.22,800 కోట్లకు గానూ రూ.7600 కోట్లు, రైతు కూలీలకు రూ.14,400 కోట్లు, రైతు బోనస్ రూ.7,625 కోట్లకు గాను రూ.25 కోట్టే ఇచ్చి దగా చేసిందని దుయ్యబట్టారు. మక్క, పత్తి, వరి, పసుపు, ఎర్రజొన్న, జొన్నలకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా మోసం చేసిందని, ధాన్యం సేకరణకు ఫుడ్ కార్పొరేషన్ ఇచ్చే నగదును కూడా తామే ఇచ్చినట్టు కాంగ్రెస్ నేతలు ఫోజులు కొడుతున్నారని విమర్శించారు.