హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ను బద్నాం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరంపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై మంగళవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేడిగడ్డ బరాజ్‌ని మరమ్మతు చేయాలని కాళేశ్వరం కమిషన్ చెప్పిందని పేర్కొన్నారు. దీన్నిబట్టి మిగతా ప్రాజెక్ట్ అంతా బాగానే ఉన్నదని స్పష్టమైందని తెలిపారు. దీంతో కాళేశ్వరం కొట్టుకుపోలేదు, రూ.93,000 కోట్లు వృథా కాలేదని పేర్కొన్నారు. అన్ని బరాజ్‌లు, పంప్‌హౌస్‌లు, కాలువలు, రిజర్వాయర్లు బాగానే ఉన్నాయని, ప్రస్తుతం అవి పని చేస్తున్నాయని తెలిపారు. ఇదే విషయాన్ని ఎన్డీఎస్ఏ మే 2024లోనే సూచించిందని, తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పిందని పేర్కొన్నారు. కానీ రేవంత్ ప్రభుత్వం ఏడాది గడిచినా మరమ్మతు పనులు ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే బరాజ్‌ను మరమ్మతు చేయకుండా వదిలేశారని ఆరోపించారు. ఎన్డీఎస్ఏ చెప్పి సంవత్సరం దాటినా చర్యలు తీసుకోకుండా ప్రజాధనాన్ని వృథా చేసింది రేవంత్ ప్రభుత్వం కాదా? ఒకరోజులో అసెంబ్లీలో కమిషన్ రిపోర్ట్ పెట్టి, తీర్మానం చేసి, సీబీఐకి అప్పగించడానికి పాత జీవోను మార్చి సీబీఐకి సిఫారసు లేఖ పంపిన ప్రభు త్వం.. అంతే శ్రద్ధ ప్రాజెక్ట్ మరమ్మతుపై ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.