హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ సొమ్ముతో నిర్వహించిన అధికారిక సభలో కేసీఆర్‌ను తిడుతూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం ఏంటి? అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. నెల రోజుల కింద తమ మీటింగ్‌కు డేట్ ఫిక్స్ చేసుకున్నామని సీఎం రేవంత్ చెబుతున్నారని, నెల కిందనే జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరతారని, జగిత్యాలలో పలానా సమాయానికి మీటింగ్ పెడతారని రేవంత్‌రెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ బహిరంగ సభ ఉందనే సీఎం రేవంత్ పిల్లచేష్టలకు తెర లేపారని మండిపడ్డారు. సభను అడ్డుకునేందుకే హైవేను తవ్వించడం, సభ రోజే మేడిగడ్డ సందర్శన, కేసీఆర్ స్పీచ్‌ను ప్రజలు వినొద్దని అదే సమయానికి సభ పెట్టుకున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఎన్ని వేషాలు వేసినా ప్రజలు కేసీఆర్‌ను మర్చిపోరని తెలిపారు.