CM Revanth Reddy | హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): అధికారం ఇస్తున్న కిక్కు ముఖ్యమంత్రిని విజ్ఞత మరిచేలా చేస్తున్నది. సీఎం పీఠమెక్కి రెండు నెలలైనా కాలేదు అప్పుడే తన రాజకీయ ప్రత్యర్థులకు హింస్మాత్మకంగా హెచ్చరికలు జారీచేస్తున్నారు. గొంతు పిసుకుతాం.. గొయ్యి తొవ్వుతాం.. బొంద పెడ్తాం అంటూ బెదిరిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యున్నతమైన అధికార పదవిలో కొనసాగుతున్న ఓ వ్యక్తి నుంచి ఇటువంటి దిగజారుడు వ్యాఖ్యలు విస్మయం గొల్పుతున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మరోసారి తమకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నందునే బీఆర్ఎస్పై ఆయన విరుచుకుపడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలవిగాని హామీలనిచ్చి, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని.. వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నందుకే ప్రత్యర్థి పార్టీలను ముఖ్యంగా బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకొంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో గురువారం జరిగిన కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగం బీఆర్ఎస్ పట్ల ఆయన అసహనానికి అద్దం పట్టిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీఎం తన స్థాయిని, హోదాను మరిచి బీఆర్ఎస్ను ‘బొంద’ పెడ్తాం, రాష్ట్రం నుంచి ‘తుడిచివేస్తాం’ అంటూ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురిచేశాయి. తెలంగాణను సాధించిన ఉద్యమ నాయకుడు, పదేండ్లపాటు ప్రజల మన్నన పొందిన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేత కే చంద్రశేఖర్‌రావుకు వ్యతిరేకంగా చేసిన అనుచిత వ్యాఖ్యలు విస్మయం కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ను గొంతు పిసుకుతారని వ్యాఖ్యానించారు. పులి విశ్రాంతి తీసుకుంటున్నదని.. త్వరలోనే గర్జిస్తుందని బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందిస్తూ.. ‘పులిని పట్టుకొనేందుకు మా కార్యకర్తలు బోన్లతో సిద్ధంగా ఉన్నారు’ అని అంటూ తాను మేస్త్రీని అని 100 అడుగుల గొయ్యి తీసి బీఆర్ఎస్ను బొంద పెడ్తానని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి దావోస్‌లో ఇటీవల రూ.40 వేల కోట్లకుపై పెట్టుబడులపై కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు తన ఖాతాలో పడకపోవడంపైనే రేవంత్‌రెడ్డి అసహనానికి గురవుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆయా సంస్థలు నాటి మంత్రి కే తారకరామారావుతో కుదుర్చుకున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆ సంస్థలు మరోసారి ఎంవోయులు రాసుకున్నాయి తప్ప.. ఇందులో రేవంత్‌రెడ్డి గొప్పదనం ఏమీ లేదంటూ సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలే సీఎం విచక్షణను కోల్పోవడానికి కారణంగా చెప్తున్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై బీఆర్ఎస్ నిలదీస్తున్నందునే ఆ పార్టీపై ఆయన తన అక్కసును వెళ్లగక్కుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.