మక్తల్ : బీఆర్ఎస్ (BRS) పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా జరుపుకుంటున్న రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి (Chittem Rammohan Reddy) అన్నారు. ఈనెల 27న వరంగల్ ( Warangal ) జిల్లాలో విజయోత్సవ బహిరంగ సభకు మక్తల్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసిన వలస పాలకుల మోసాలను ఎండగట్టేందుకు నాడు టీఆర్ఎస్ ఆవిర్భవించిందని తెలిపారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా ఉద్యమాన్ని చేపట్టిన ఘనత కేసీఆర్కు ఉందన్నారు.
కేసీఆర్ (KCR ) ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలు అందాయని వెల్లడించారు. రైతుబంధు, కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, రైతన్నకు 24 గంటల ఉచిత విద్యుత్ , సాగుకు పుష్కలంగా నీరు అందించి తెలంగాణను పచ్చని తెలంగాణగా మార్చారని పేర్కొన్నారు.