హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ తప్పుడు లెక్కలు చెప్పి అడ్డంగా దొరికిపోయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. అసెంబ్లీ, పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర సర్కారు బండారం బట్టబయలైందని విరుచుకుపడ్డారు. తెలంగాణ అప్పులు రూ.4.42 లక్షల కోట్లని పార్లమెంట్లో ఆర్థికమంత్రి ప్రకటించారని గుర్తుచేశారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం రూ.8 లక్షల కోట్లు అంటూ తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని అన్నారు. ఎన్నికల ముందు అధికారం కోసం అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ సభలోనూ నిస్సిగ్గుగా అసత్యాలు చెప్పి తప్పుదోవపట్టించిందని మండిపడ్డారు. శాసనమండలి వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంలో బీఆర్ఎస్ సభ్యులు సఫలీకృతులయ్యారని చెప్పారు. రైతులు, మహిళలు, ఆటోడ్రైవర్లు ఇలా అన్నివర్గాల గొంతుకను వినిపించామని, ప్రతిరోజూ వినూత్న నిరసనలు చేపట్టామని తెలిపారు. మండలి మీడియా పాయింట్ వద్ద శుక్రవారం మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు సత్యవతిరాథోడ్, సురభి వాణీదేవి, ఎల్ రమణ, నవీన్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, గోరటి వెంకన్న, తక్కళ్లపల్లి రవీందర్రావు, చల్లా వెంకట్రామిరెడ్డి, తాతా మధు, దేశపతి శ్రీనివాస్ తదితరులతో కలిసి కవిత మాట్లాడారు. కాళేశ్వరం కూలిపోయిందనేది అవాస్తమని మంత్రి ఉత్తమ్ సభలో స్పష్టం చేశారని అన్నారు. కేసీఆర్‌పై సీఎం అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలిపామని, రీయింబర్స్‌మెంట్‌పై ప్రశ్నించామని చెప్పారు. బీసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంలో క్రియాశీలకంగా వ్యవహరించామని అన్నారు.
ఏప్రిల్ 27న ఎల్కతుర్తి వద్ద బీఆర్ఎస్ రజతోత్సవ సభను మహాకుంభమేళా తరహాలో నిర్వహించనున్నామని కవిత తెలిపారు. ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ సర్కారు మండలి సమావేశాలను ప్రహసనంలా నిర్వహించిందని ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆరోపించారు. సమస్యలు చర్చకు రాకుండా అబద్ధాలు చెప్తూ సభను తప్పుదోవపట్టించిందని విమర్శించారు. బీఆర్ఎస్ తరఫున ప్రజాసమస్యలను ఎలుగెత్తి చాటామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టామని చెప్పారు. కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగం లాంటిందని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అభివర్ణించారు. మండలిలో బీఆర్ఎస్ ప్రజల గొంతుకగా సమస్యలను లెవనెత్తిందని ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోయిందని మరో ఎమ్మెల్సీ ఎల్ రమణ విమర్శించారు. మండలిలో బీఆర్ఎస్ తరఫున ప్రజా సమస్యలను లేవనెత్తామని, కానీ మీడియా వాటికి అంతగా ప్రాధాన్యమివ్వలేదని శేరి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు.
అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కవిత డిప్యూటీ చైర్మన్ ప్రకాశ్‌కు వినతిపత్రం అందజేశారు.