Elkathurthy Sabha | హైదరాబాద్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ): ఒక్క సభ… అధికార కాంగ్రెస్‌ను ఉలిక్కిపడేలా చేసింది. 50 నిమిషాల ప్రసంగం కాంగ్రెస్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ఆ సభ బీఆర్ఎస్ రజతోత్సవ సభ అయితే.. ఆ స్పీచ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ది. ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ కావడంతో అధికార కాంగ్రెస్ బెంబేలెత్తిపోయింది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టిన కేసీఆర్ ప్రసంగంతో ఆత్మరక్షణలో పడిపోయింది. సభకు పోటెత్తిన అశేష జనవాహినిని చూసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు భవిష్యత్తు కండ్లముందు సాక్షాత్కరిస్తున్నది. రాష్ట్రంలో తమ పార్టీకి ఇక నూకలు చెల్లినట్లేననే అంతర్మథనం వారిలో మొదలైందనే చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్‌లో ఏ ఇద్దరు నేతలు కలిసినా.. రజతోత్సవ సభ, కేసీఆర్ ప్రసంగంపైనే చర్చిస్తున్నారు. హాజరైన ప్రజల సంఖ్య.. రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు అద్దం పడుతున్నదనే చర్చ జోరుగా జరుగుతున్నది. అధికార పార్టీ ఏడాదిన్నర కాలంలో ఇంతలా పతనం కావడం, ప్రతిపక్ష పార్టీ ఇంత తక్కువ సమయంలో ప్రజాదరణ చూరగొనడం అసాధారణ విషయంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ సభ, కేసీఆర్ ప్రసంగం బీఆర్ఎస్ క్యాడర్, లీడర్లలో నూతనోత్సాహం నింపితే.. కాంగ్రెస్ క్యాడర్, లీడర్లలో నైరాశ్యం నింపింది.
మంత్రుల ప్రెస్‌మీట్.. కాంగ్రెస్‌లోనే విమర్శలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం కోసం యావత్ తెలంగాణ ప్రజలు ఎంత ఆత్రుతగా ఎదురు చూశారో… సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ మంత్రులు అంతకన్నా ఎక్కువగా ఎదురుచూసినట్లు ఉన్నారు. సభ మొదలు కావడానికి ముందే మంత్రులు పొంగులేటి, సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. కేసీఆర్ ప్రసంగాన్ని 50 నిమిషాల పాటు సీఎం సహా మంత్రులంతా కలిసి వీక్షించారు. ఆ తర్వాత మంత్రులంతా సీఎం ఇంటి బయటే మీడియా ముందుకొచ్చారు. నలుగురు మంత్రుల్లో ఏ ఒక్కరూ కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. గులాబీ అధినేతపై ఎదురుదాడికే యత్నించారు. ఓవైపు కేసీఆర్ రాజనీతిజ్ఞతతో విమర్శలు గుప్పిస్తే.. మంత్రులు మాత్రం ఫ్రస్ట్రేషన్‌కు గురై కేసీఆర్‌పై వ్యక్తిగత దాడికి దిగారు. మంత్రుల వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ సభ పెట్టుకుంటే వదిలేయకుండా సీఎంతో పాటు మంత్రులంతా స్పందించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మంత్రులంతా ఇష్టమొచ్చినట్లు మాట్లాడి సభకు మరింత హైప్ తీసుకొచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
యువత, రైతులు.. బీఆర్ఎస్కు షిఫ్ట్
గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు మొన్నటి వరకు కాంగ్రెస్‌కు అండగా నిలిచిన యువత, రైతులు ఇప్పుడు ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ సభకు తరలివచ్చినవారిలో అత్యధిక శాతం యూత్, రైతులే ఉండడాన్ని వారు ఉదహరిస్తున్నారు. వారంతా తండోపతండాలుగా స్వచ్ఛందంగా తరలివచ్చారు. దీంతో రాష్ట్రంలోని యువత, రైతులు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వైపు మళ్లారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు, యువతను బీఆర్ఎస్ వైపు వెళ్లకుండా చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల సమయంలో యువత, రైతులను ఆకట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ తర్వాత వారి మద్దతును కాపాడుకోవడంలో విఫలమయ్యారని అంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైన కాంగ్రెస్.. రైతులకు రైతుభరోసా, ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడంలోనూ విఫలమైందని చెబుతున్నారు. కాంగ్రెస్‌తో పోల్చితే బీఆర్ఎస్ ప్రభుత్వమే బెటర్ అనే అభిప్రాయం యువత, రైతుల్లో వ్యక్తమవుతుందని పేర్కొంటున్నారు.
కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ మొదలు
ఎల్కతుర్తి సభతో తాము అధికారంలోకి వచ్చేశామని కేసీఆర్ ప్రకటించేశారు. రెండున్నరేండ్ల సమయం మాత్రమే కాంగ్రెస్‌కు ఉందని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని బలంగా చెప్పారు. కేసీఆర్ ప్రకటనతో తమ పార్టీకి కౌంట్‌డౌన్ మొదలైందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చర్చించుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే డౌన్‌ఫాల్ మొదలైందని చెబుతున్నారు. ఓవైపు బీఆర్ఎస్ పుంజుకోవడం, మరోవైపు కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత మరింతగా పెరుగుతుండడంతో ఇప్పట్లో కాంగ్రెస్ సర్కారు లేచే పరిస్థితి లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంలోనే అధికార పార్టీపై ప్రజల్లో ఇంత వ్యతిరేకత రావడం, అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ పెరగడం సాధారణ విషయం కాదని చెబుతున్నట్టు సమాచారం. తమ పార్టీ ఎంత వేగంగా క్షీణిస్తున్నదో ఈ పరిస్థితిని చూస్తే అర్థమవుతున్నదని సొంత పార్టీ నేతలే చెబుతుండడం గమనార్హం. ఇప్పటికైతే పార్టీ పరిస్థితి ఇంతేనని, ఏం చేయలేని పరిస్థితి నెలకొన్నదని పెదవి విరుస్తున్నారు.
కాంగ్రెస్ ఉంటేనే బీఆర్ఎస్కు లాభం
కాంగ్రెస్ సర్కారును పడగొట్టబోమని, ఆ అవసరం తమకు లేదని, ప్రజలే కాంగ్రెస్ పార్టీ వీపు సాపు చేస్తరంటూ ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ప్రకటించారు. అయితే ప్రభుత్వాన్ని పడగొట్టబోమనే మాటల వెనుక పెద్ద వ్యూహమే ఉందనే అభిప్రాయాలు బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఇప్పటికే పరిపాలనలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ సర్కారు పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నది. కేసీఆర్ చెప్పినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఫెయిలైంది. దీంతో ఇప్పుడిప్పుడే రైతులు, యువత, ప్రజల్లో కాంగ్రెస్‌పై ఉన్న సానుభూతి, సదాభిప్రాయాలు తొలగిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే తమ బతుకులు బర్బాదేననే భయానికి ప్రజలు వచ్చారు. ఇందుకు తగ్గట్లుగానే కేసీఆర్ కూడా కాంగ్రెస్ ఉంటేనే తమకు లాభమని, అప్పుడే ప్రజలకు మంచేదో, చెడేదో తెలుస్తుందని చెప్పారు. ఎన్నికల సమయంలోనూ ఓ సందర్భంలో గాడిద ఉంటేనే కదా గుర్రం విలువ తేలిసేదంటూ వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటూ, ప్రజాభిమానాన్ని కోల్పోతున్న పార్టీ, ప్రభుత్వంపై మరో రకంగా ముందుకెళ్లాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రజలే ఆ పార్టీకి బుద్ధి చెబుతారని, అందుకే కేసీఆర్ ఆ విధంగా వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కగార్‌పై కేసీఆర్ ఎత్తుగడ… బీఆర్ఎస్ వైపు వామపక్షాల చూపు
కగార్ పేరుతో మావోయిస్టులపై కేంద్ర సర్కారు చేస్తున్న మారణకాండను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ విధంగా కగార్ విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా గళం విప్పిన మొదటి రాజకీయ నేత కేసీఆర్ కావడం గమనార్హం. కేసీఆర్ మద్దతుతో, ఆయన ప్రసంగంతో వామపక్ష పార్టీలకు, ప్రజా సంఘాలకు బలం వచ్చినట్టయింది. అయితే ఓవైపు వామపక్ష పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ గాని, సీఎం రేవంత్‌రెడ్డి గాని ఈ వివాదంపై ఇప్పటి వరకు నోరు మెదపలేదు. సాధారణంగా వామపక్ష పార్టీలు, లెఫ్ట్ భావజాలమున్న ప్రజాసంఘాలు కాంగ్రెస్‌కు సానుభూతిపరులుగా ఉంటాయి. కానీ, ఈ దెబ్బతో కాంగ్రెస్‌పై గుర్రుగా ఉన్న వాళ్లంతా ఆ పార్టీకి దూరమై బీఆర్ఎస్ వైపు చూసే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ సోషల్ మీడియా అట్టర్‌ఫ్లాప్…
ఎల్కతుర్తి సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకున్నది. అంత పెద్ద సభలో వారందరికీ ‘నేనున్నా’నంటూ కేసీఆర్ భరోసా ఇచ్చారు. సాధారణంగా ఏ పార్టీ అగ్రనేత కూడా ఈ విధంగా సొంత పార్టీ సోషల్ మీడియా వారియర్స్‌కు భరోసా ఇచ్చిన సందర్భాలు లేవు. ఇది వారికి పెద్ద బూస్టింగ్ అనే చెప్పాలి. అదే సమయంలో కాంగ్రెస్ సోషల్ మీడియా అట్టర్‌ఫ్లాప్ అయిందనే అభిప్రాయాలు కాంగ్రెస్ వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వారియర్ల ప్రాధాన్యతను కేసీఆర్ గుర్తించారని, కానీ ఈ విషయంలో రేవంత్‌రెడ్డి విఫలమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వెనుక సోషల్ మీడియా వారియర్ల శ్రమ 50 శాతానికి పైగా ఉన్నది. అలాంటి సోషల్ మీడియాను, వారియర్లను అధికారంలోకి వచ్చాక రేవంత్‌రెడ్డి పక్కనపెట్టారని, నిర్లక్ష్యం చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ఉండి కూడా వారికి భరోసా ఇవ్వలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.