కరీంనగర్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురు గాలి వీస్తున్నదని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఈ నెల 19న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తారని, ఇటీవల గెలిచిన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సత్కరిస్తారని తెలిపారు. సోమవారం కరీంనగర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా స్థాయి సమావేశంలో వారు పాల్గొన్నారు. వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మొగ్గు చూపడం సహజమని, కానీ రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తంచేశారు.
గంగుల మాట్లాడుతూ.. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా మున్సిపాలిటీలకు రూపాయి కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో వేసిన రోడ్లకు గుంతలు పడితే పూడ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వాల హయాంలో లేదని ఎద్దేవా చేశారు. పట్టణ ప్రజల ఓట్లు అడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్కు మాత్రమే ఉన్నదని స్పష్టంచేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ పంచాయతీల మాదిరిగానే మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటుతామని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్, రసమయి, రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు, పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, జడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, కనుమల్ల విజయ, మాజీ మేయర్ రవీందర్‌సింగ్ పాల్గొన్నారు.