RS Praveen Kumar | హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రూ. 8000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టివేయబడుతున్నాయని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఫీజులు పెండింగ్లో ఉన్నాయని సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు పై చదువులకు వెళ్ళలేక, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేక నరకం అనుభవిస్తున్నారు అని ఆర్ఎస్పీ తెలిపారు.
ఈ సమస్య, రైతుల యూరియా సమస్య కంటే తక్కువేమీ కాదు. రైతులు రోడ్ల మీదికి వస్తున్నారు, విద్యార్థులు రాలేక పోతున్నారు. అంతే తేడా! మా సర్టిఫికెట్లు ఇప్పించాలని అధికారులను అడిగితే వాళ్లేమో ప్రభుత్వాన్ని అడుగమంటున్నారు. ప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డేమో విద్యార్థులకు దొరకరు. పైగా అక్రమ కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు. మరి విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? తెలంగాణ ప్రభుత్వానికి అసలు సోయి ఉన్నదా? వెంటనే విద్యార్థుల బకాయిలు చెల్లించి న్యాయం చేయకపోతే, గాంధీ భవన్, ముఖ్యమంత్రి బంగ్లాను ముట్టడిస్తాం జాగ్రత్త అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. రైతులు, విద్యార్థులు మీకు ఓటు వేయలేదా? వారిపై ఎందుకింత నిర్లక్ష్యం? అని రేవంత్ సర్కార్ను ఆర్ఎస్పీ నిలదీశారు.