BRS | హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన చూస్తే ఏమున్నది గర్వకారణం? పాలన సమస్తం.. ప్రజాపీడన పరాయణత్వం.. అని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బడికెళ్లే చిన్నారుల నుంచి పింఛన్లు పొందే వృద్ధుల వరకు, వాంకిడి గురుకుల బిడ్డల నుంచి లగచర్ల గిరిజనుల వరకు, నిరుద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు ఏడాది పాలనలో రేవంత్‌రెడ్డి అందరినీ వంచించారని మండిపడింది. బడి పిల్లల నుంచి అవ్వాతాతల వరకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్డెక్కె దుస్థితి కల్పించిందని విమర్శించింది. ఏడాదిపాలన- ఎడతెగని వంచన.. అందుకే విజయోత్సవాలు కాదు.. వంచనోత్సవాలు జరపాలని చురకలు అంటించింది. ఆరు గ్యారెంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించి అమలుచేయకుండా అన్ని వర్గాలకు అన్యాయం చేసిందని మండిపడింది. దివాలా దివాలా అని దిక్కుమాలిన ప్రచారం చేసిన రేవంత్‌రెడ్డి సర్కారు రాష్ట్ర ఖ్యాతిని దిగజార్చి, పరపతి లేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆదివారం చార్జిషీట్ ప్రచురించింది. తెలంగాణభవన్‌లో పార్టీ నేతలతో కలిసి మాజీ మంత్రి హరీశ్‌రావు విడుదల దీనిని చేశారు.
రైతు సంక్షేమానికి రాహుకాలం