హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టానికి (Telangana) జరుగుతున్న జలదోపిడీపై బీఆర్ఎస్ (BRS) పోరుబాటకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రాజెక్టులపై (Irrigation Projects) కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) సమరశంఖం పూరించనున్నారు. ఈ మేరకు త్వరలోనే కార్యాచరణను ప్రకటించనున్నారు. ఆయా అంశాలపై లోతుగా చర్చించేందుకు కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 19న పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణభవన్‌లో మధ్యాహ్నం2 గంటలకు బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగనున్నట్టు కేసీఆర్ పీఆర్వో కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై, పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఈ సమావేశంలో చర్చ జరుగనున్నది. గోదావరి, కృష్ణ జలాలను కొల్లగొడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దోపిడీని అడ్డుకోవడంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల రైతాంగ సాగునీటి హకులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ భావిస్తున్నది. ఏపీ జలదోపిడీపై తెలంగాణ ప్రజా ఉద్యమాలు ఎలా చేపట్టాలనే అంశంపై పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి అధినేత కేసీఆర్ లోతుగా చర్చించనున్నారు.
19న ఉద్యమ స్వరూపానికి బీజం
‘బీఆర్ఎస్ ప్రభుత్వమే తిరిగి వచ్చి ఉంటే ఈపాటికి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీళ్లు అందేవి. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ప్రజల, రైతాంగ ప్రయోజనాలు కాపాడబడేవి. కానీ, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు పాలమూరు ప్రాజెక్టుపై పూర్తి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నది. బీఆర్ఎస్ 90 శాతం పనులు పూర్తిచేయగా, మిగిలిన 10 శాతం పనులు చేయకపోవడంతో మూడు జిల్లాల ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రెండేండ్లు గడిచినా రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంకా తెలంగాణ సమాజం మౌనం వహించజాలదు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు, కృష్ణా జలాల్లో కేవలం 45 టీఎంసీలకు ఒప్పుకోవడం క్షమించరాని ఘోరం. సాగునీటి అంశంలో తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడే విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నటికీ రాజీ పడబోదు’ అని కేసీఆర్ స్పష్టంచేశారు. ఇలాంటి కీలక సమయంలో నీటి కేటాయింపులు, ఏపీ జలదోపిడీ వంటి విషయాలతోపాటు, పార్టీ సంస్థాగత నిర్మాణ విషయాలు సహా పలు అంశాలను ఈ నెల 19న జరిగే సంయుక్త సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కూలంకషంగా చర్చ జరగనున్నది. అందుకు అనుగుణంగా చేపట్టబోయే ప్రజా ఉద్యమాల నిర్మాణం, అనుసరించాల్సిన కార్యాచరణపై కీలక నిర్ణయాలు ఉంటాయి. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, జలాల కేటాయింపు, కృష్ణా, గోదావరి జలాల విషయంలో ఏపీ జలదోపిడీపైన పోరాడేందుకు ఒక ఉద్యమ స్వరూపానికి ఈ సమావేశంలో బీజం పడనున్నది.
బీజేపీ విధానంపై పోరాటాలే శరణ్యం
‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వవ ఇప్పుడు కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రం ఎదుట దేబరించడం బాధాకరం. 45 టీఎంసీలకు అంగీకరిస్తూ కేంద్రం వద్ద రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మోకరిల్లి రావడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి రాష్ర్టానికి తీవ్ర అన్యాయం చేయడమే. రాష్ర్టానికి, ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఒకరూ మాట్లాడిన పాపాన పోవట్లేదు. బీజేపీయే తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు గండి కొడుతున్నదనే విషయం స్పష్టమవుతున్నది. రాష్ర్టానికి సాగునీటి పథకాల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని, కావేరి తదితర నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడీకి సహకరిస్తున్న కేంద్రం విధానాన్ని ఎదురోవాలంటే తెలంగాణ సమాజానికి మరోసారి ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం’ అని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.