మహబూబ్‌నగర్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బుధవారం వాకింగ్‌కు వెళ్లిన పట్నంను అదుపులోకి తీసుకొని అక్రమ కేసులు బనాయించడంపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గులాబీ పార్టీ శ్రేణులు రోడ్లపైకి చేరి నిరసన తెలిపాయి. ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వబోమని తేల్చిచెప్పిన రైతులకు మద్దతిచ్చిన బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం సరికాదని నినదించాయి. పట్నంపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. మక్తల్, నారాయణపేట మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి పట్నం అరెస్టును ఖండించారు.