ఖైరతాబాద్, అక్టోబర్ 13 : అన్యాయానికి గురైన గ్రూప్-1 అభ్యర్థులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర నేత రాకేశ్‌రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణ విద్యార్థి ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగ జేఏసీ ప్రతినిధి జనార్దన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షల్లో అవకతవకలపై కోర్టు రీ ఎగ్జామ్స్‌కు ఆదేశించినా ప్రభుత్వం మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 55ని తుంగలో తొక్కి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అన్యాయం చేసేలా జీవో 29ను తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
40శాతం మంది తెలుగు మీడియం అభ్యర్థులు గ్రూప్-1 పరీక్షలు రాస్తే కేవలం 8, 9 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారని.. యూపీఎస్సీ మెయిన్స్, ఇంటర్వ్యూలకు వెళ్లిన వారు అర్హత కూడా సాధించలేకపోయారని, ఇంత దారుణంగా వాల్యూయేషన్ చేస్తారా అని ప్రశ్నించారు. వరంగల్ అభ్యర్థికి గ్రూప్-1లో ట్రైబల్ వెల్ఫేర్శాఖలో పోస్టు వచ్చిందని, తన కంటే తక్కువ మార్కులు వచ్చిన వ్యక్తికి ఎక్సైజ్‌లో వచ్చిందని చెప్పారని, ఇలాంటివి ఎన్నో అభ్యర్థులే స్వయంగా చెబుతున్నారని వివరించారు. అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లినా బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. అభ్యర్థుల పోరాటానికి మద్దతిస్తామని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ ప్రకటించారు. గ్రూప్-1 వ్యవహారంలో వంద కోట్ల అవినీతి జరిగిందని ఆర్పీఐ అధ్యక్షుడు వినోద్‌కుమార్ ఆరోపించారు.