ఆదిలాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ) : రైతు సమస్యలపై బీఆర్ఎస్ ఆందోళనబాట పట్టింది. రైతుల పంట దిగుబడులు కొనకపోవడంపై శుక్రవారం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా నిరసనలకు శ్రీకారం చుట్టింది. వానకాలంలో రైతులు పండించిన పంటలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సి ఉండగా.. ప్రభుత్వరంగ సంస్థలు కొర్రీలు పెడుతూ చేతులెత్తేయడంతో రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో వానకాలంలో రైతులు పత్తి, సోయా, కంది, మక్కజొన్న పంటలు సాగు చేశారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో దిగుబడులు సగానికి పడిపోయాయి. సోయాబీన్ ఎకరాకు 10 క్వింటాళ్లు, మక్క 30 క్వింటాళ్ల వరకు దిగుబడులు రావాల్సి ఉండగా.. సోయా ఐదు నుంచి ఆరు క్వింటాళ్లు, మక్క 20 క్వింటాళ్ల లోపు వచ్చాయి. సోయా క్వింటాల్‌కు రూ.5,328, మక్కలు క్వింటాల్‌కు రూ.2,400 మద్దతు ధర ఉండగా నవంబర్ మొదటి వారంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పంటల కొనుగోళ్లను ప్రారంభించారు.
ఆదిలాబాద్ జిల్లాలో సోయా, మక్క పంట ల కొనుగోళ్లు నామమాత్రంగానే సాగాయి. సోయాబీన్ దాదాపు 4 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా ఉండగా మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో 1.30 లక్షల క్వింటాళ్లు మాత్రమే సేకరించారు. సోయా నాణ్యత సరిగా లేదంటూ నాఫెడ్ అధికారులు తిరస్కరిస్తున్నారు. దీంతో మార్కెట్ యార్డుల్లో పంటను కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ యార్డులకు పంటను విక్రయానికి తీసుకొచ్చి రాత్రీపగలు కాపలాగా ఉంటున్నారు. జిల్లాలో నెల రోజులుగా ఇదే పరిస్థితి నెలకొన్నది. ప్రైవేటు వ్యాపారులకు పంటను అమ్ముకుందామంటే సోయా క్వింటాల్‌కు రూ.4,300, మక్క రూ.1,800 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీంతో భారీగా నష్టపోతుండటంతో ప్రైవేటుకు అమ్మడానికి రైతులు ముందుకురావడం లేదు. వర్షాల కారణంగా పంటలు నష్టపోయామని, పైగా ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్మితే మరింత నష్టపోవాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో సోయా, మక్క పం టలు కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనలు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. పంటల అమ్మకం కోసం తిరిగి వేసారిన రైతులు ఆందోళన బాటపట్టారు. బేల, బజార్హత్నూర్ మండలాల్లో ఇటీవల బంద్ పాటించారు. ఆదిలాబాద్, బోథ్ మార్కెట్‌యార్డుల ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి వరుస ఆందోళనలు చేపడుతున్నట్టు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు.