హైదరాబాద్, ఆక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): పెంచిన బస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసనకు బీఆర్ఎస్ (BRS) పిలుపునివ్వడంతో ప్రభుత్వం హడలిపోయింది. హైదరాబాద్ బయలుదేరే బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టులు చేయాలని బుధవారం రాత్రి అన్ని కమిషనరేట్లు, జిల్లాలు, మండల పోలీస్స్టేషన్లకు ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసు శాఖ బీఆర్ఎస్ శాంతియుత నిరసనపై ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాల్లోని యాక్టివ్‌గా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తల ఇండ్లకు తెల్లవారుజామునే పోలీసులు వెళ్లి వారిని హౌస్ అరెస్టు చేశారు. మరికొందరిని సమీపంలోని పోలీస్‌స్టేన్లకు తరలించి.. మధ్యాహ్నం వరకు నిర్బంధించారు.
గురువారం తెల్లవారుతుండగానే హైదరాబాద్ నగరంలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావుగౌడ్, ఎమ్మెల్యేలు కేవీ వివేకానంద, ముఠాగోపాల్, కాలేరు, లక్ష్మారెడ్డి తదితర నేతల ఇండ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కేటీఆర్, హరీశ్‌రావు ఇండ్ల వద్ద వందల సంఖ్యలో పోలీసులు మోహరించి హౌస్ అరెస్టులు చేశారు. కేటీఆర్, హరీశ్‌రావు హౌస్ అరెస్టులపై విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వారితోపాటు పార్టీ నేతలకు బస్సుభవన్ వెళ్లేందుకు అనుమతిచ్చింది. దీంతో కేటీఆర్.. తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావుగౌడ్‌తో కలిసి సికింద్రాబాద్‌లోని రైతిఫిల్ బస్‌స్టాప్ నుంచి బస్సులోనే బస్సుభవన్ వరకు చేరుకున్నారు. బస్‌భవన్ వైపు వెళ్తున్న బీఆర్ఎస్ బృందాలను ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మహిళలు, పురుషులు అని చూడకుండా ఈడ్చిపడేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్ నుంచి బస్‌భవన్‌లోకి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను మొత్తం ఆరు అంచెల్లో పోలీసులు అడ్డుకున్నారు.
బీఆర్ఎస్ శాంతియుత నిరసన నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బస్‌భవన్ సమీపంలో పోలీసులు భారీగా మోహరించారు. సుమారు రెండువేల మందికిపైగా బందోబస్తుతో బస్‌భవన్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతోపాటు జేబీఎస్, రైత్‌ఫిల్ బస్టాప్‌ల వద్ద కూడా వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. వివిధ విభాగాలకు చెందిన ఏసీపీలు 50 మంది, ఇన్స్పెక్టర్లు 70 మంది, ఎస్ఐ స్థాయి అధికారులు 150 మంది వరకు విధుల్లో పాల్గొన్నారు.
‘చార్జీల పెంపుపై శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే రాష్ట్ర ప్రభుత్వం మా పార్టీ నేతలందరినీ ఎకడికకడ అరెస్టు చేసింది. మా పార్టీ నేతలను అరెస్టు చేయడంపై ఉన్న ఆసక్తి రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని నగరంలో పెరిగిపోతున్న క్రైమ్ రేటును తగ్గించడంపై పెడితే మంచిది’ అని కేటీఆర్ హితవు పిలికారు. ‘ఆర్టీసీ బస్సు చార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ పిలుపుమేరకు వచ్చిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను ఎకడికడ హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమని హరీశ్‌రావు పేర్కొన్నారు.