రంగారెడ్డి, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా (Rythu Bharosa) అందని రైతులు ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు. మాకెందుకు భరోసా ఇవ్వరంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టు విస్తరించి ఉన్నాయన్న కారణంతో ఇక్కడ వ్యవసాయం చేయడం లేదని భావించిన ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలోని 9 మండలాలలో సుమారు 60 వేల మంది రైతులకు రైతు భరోసా నిలిపివేసింది. ఈ తొమ్మిది మండలాల్లో అన్ని గ్రామాలలో వరి ఇతర కూరగాయల పంటలు రైతులు సాగు చేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి ప్రతిరోజు ఉదయం ఆయా మండలాల ప్రజలు గ్రామాల నుంచి కూరగాయలను అందిస్తున్నారు.
కానీ ప్రభుత్వ మాత్రం ఈ గ్రామాలలో ఒక ఎకరం కూడా సాగు కావడం లేదని వాదిస్తుంది. దీంతో బాధిత రైతులు పోరుబాట ఎంచుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న గ్రామాలను ప్రామాణికంగా తీసుకొని ఆ మండలానికి రైతు భరోసా నిలిపివేయడం సరైనది కాదని రైతులు వాపోతున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని 24 గ్రామాలు రైతు భరోసాకు దూరమయ్యాయి. మండలంలోని బొంగులూరు, ఆదిభట్ల గ్రామాలు మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్నాయి. మిగతా గ్రామాలన్నీ 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ గ్రామాలకు కూడా రైతు భరోసా నిలిపివేశారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న రెండు మూడు గ్రామాలను తీసుకొని ఆ మండలానికి పూర్తిగా రైతు భరోసాను నిలిపివేశారు.
తాము గ్రామాలలో వ్యవసాయం చేసుకుని జీవనోపాధి పొందుతున్నామని, ప్రభుత్వం మాత్రం తమకు రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదంటూ బాధిత గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం మండలంలోని వివిధ గ్రామాలలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. ఆ గ్రామాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీజేపీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించింది. కాగా సీపీఎం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం తహసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన దిగింది. రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సిందేనట్టు అన్ని రాజకీయ పార్టీలు రైతులకు అండగా నిలిచాయి.
జిల్లాలో రైతు భరోసా నిలిపివేసిన 9 మండలాలలోని గ్రామాలను ఆందోళన చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈనెల 25న (బుధవారం) ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాల ద్వారా బాధ్యత గ్రామాలలో రైతులతో కలిసి రైతు భరోసా ఇచ్చేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పోరాటానికి ముందుకు రావాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అలాగే బీజేపీ, సీపీఎంలు కూడా రైతు భరోసా కోసం పోరాటానికి సిద్ధమయ్యాయి.