ఆదిలాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం సోయాబీన్ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఆదిలాబాద్ పట్టణ బంద్ విజయవంతమైంది. బంద్‌కు వ్యాపారులతోపాటు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి బంద్‌ను పర్యవేక్షించారు. ఉదయం మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆర్టీసీ బస్ డిపో ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు బీఆర్ఎస్ నాయకులను పక్కకు తొలగించి జోగు రామన్నను అరెస్ట్ చేశారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. రైతులు పండించిన సోయా కొనుగోలు చేయాలని, పత్తి పంటను తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని. యాసంగి పంటలకు రైతు భరోసా అందించాలని, యూరియా యాప్‌ను ఎత్తివేయాలంటూ బీఆర్ఎస్ వరుస ఆందోళనలు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం లేదని జోగు రామన్న మండిపడ్డారు.
ఆదిలాబాద్ జిల్లాలో రూ.133 కోట్ల పంటలను కొనుగోలు చేయాల్సి ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.