(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికార కాంగ్రెస్ బరితెగింపులకు పాల్పడినా, బెదిరింపులకు తెగబడినా జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఓటర్లు బీఆర్ఎస్ (BRS) వైపే నిలిచినట్టు మరో సర్వే తేల్చింది. రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వ రెండేండ్ల అవినీతిమయ, బుల్డోజర్ పాలనకు విసుగెత్తిపోయిన నియోజకవర్గ ప్రజలు హస్తం పార్టీకి రిక్తహస్తాన్ని మిగిల్చినట్టు స్పష్టమవుతున్నది. మంగళవారం జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్దే విజయమని ఇప్పటికే పలు ఎగ్జిట్‌పోల్స్ తేల్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల సర్వేల్లో విశ్వసనీయతకు మారుపేరుగా పేర్కొనే ప్రఖ్యాత సర్వే సంస్థ ‘కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్’ ఎగ్జిట్‌పోల్‌లోనూ బీఆర్ఎస్ పార్టీదే విజయమని తేటతెల్లమైంది. పదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ గులాబీ పార్టీకే జై కొట్టినట్టు స్పష్టమైంది.
‘కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్’ సంస్థ ఎగ్జిట్‌పోల్ ఫలితాలను బుధవారం విడుదల చేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయ ఢంకా మోగించనున్నట్టు తేల్చింది. 49% మంది ఓటర్లు కారు గుర్తుకే జై కొట్టారని చెప్పింది. 41% మంది కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించగా, 8% మంది బీజేపీకి, 2% మంది ఇతరులకు ఓటేసినట్టు ఎగ్జిట్‌పోల్ విశ్లేషించింది. బీఆర్ఎస్ అభ్యర్థి ఏకంగా 8% ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపు దిశగా పయనిస్తున్నట్టు పేర్కొన్నది. ప్రజల్లో బీఆర్ఎస్పై ఉన్న విశ్వాసం, ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతపై ఉన్న ఆదరణ ఈ ఫలితాలకు కారణమని సర్వే సంస్థ అభిప్రాయపడింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గులాబీ జెండా రెపరెపలు ఖాయమని ‘కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్’ సంస్థ ప్రీ-పోల్ సర్వేలోనూ తేల్చిచెప్పింది. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 30 వరకు 45 రోజులపాటు చేసిన సర్వే ఫలితాలను గతంలో ప్రకటించింది. ఈ ఉపఎన్నికలో గెలవడానికి బీఆర్ఎస్కు 100% అవకాశం ఉన్నదని కేకే సంస్థ సీఈవో కిరణ్ కొండేటి గతంలో కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టి గెలువడం కాంగ్రెస్‌కు ముమ్మాటికీ అసాధ్యమని తేల్చారు. కేకే సంస్థ ప్రీ-పోల్ సర్వే ప్రకారం.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్కు 55.2% మంది ఓటర్లు జై కొట్టగా, కాంగ్రెస్‌కు 37.8% మంది ఓటర్లు మద్దతు ప్రకటించినట్టు కొండేటి తెలిపారు. బీజేపీ వైపు 7% మంది ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు, జూబ్లీహిల్స్‌లో గడిచిన 45 రోజులుగా నిర్వహించిన దాదాపు అన్ని ప్రీ-పోల్ సర్వేల్లోనూ బీఆర్ఎస్కే ఓటర్లు పట్టం కట్టినట్టు తేలింది. ‘కోడ్మో-కనెక్టింగ్ డెమోక్రసీ’, ‘చాణక్య స్ట్రాటజీస్’, ‘బిలియన్ కనెక్ట్’, ఎస్ఏఎస్ గ్రూప్ సంస్థకు చెందిన ‘ఐఐటీయన్ల టీమ్’, ‘ఆర్ఆర్ పొలిటికల్’ సర్వే, ‘ఓటా మీడియా హౌజ్’, ‘పీపుల్స్ ఇన్సైట్’ తదితర సంస్థలు ఇటీవల నిర్వహించిన అన్ని ప్రీ-పోల్ సర్వేల్లోనూ కారుదే విజయమని తేలింది. బయటి సర్వేలే కాదు కాంగ్రెస్ నిర్వహించిన అంతర్గత సర్వేలోనూ హస్తం పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీనే జూబ్లీహిల్స్‌లో ముందంజలో ఉన్నట్టు తేలిందని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.

కేకే సంస్థ ఎగ్జిట్ పోల్లోనే కాదు మంగళవారం పలు సంస్థలు విడుదలచేసిన ఎగ్జిట్ పోల్స్‌లోనూ బీఆర్ఎస్ గెలుపు ఖాయమని తేల్చిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్కు 41.60% ఓట్లు వస్తాయని మిషన్ చాణక్య ఎగ్జిట్‌పోల్స్‌లో పేర్కొనగా, కాంగ్రెస్ 39.43% ఓట్లతో వెనుకంజలో ఉన్నట్టు వెల్లడించింది. బీజేపీకి కేవలం 18.97% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ఎగ్జిట్ పోల్‌లోనూ కారు గెలుపును ఖరారు చేసింది. బీఆర్ఎస్కు 44.49%, కాంగ్రెస్‌కు 39.24%, బీజేపీకి 10.93% ఓట్లు వస్తాయని పేర్కొన్నది. క్యూమెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఎగ్జిట్‌పోల్‌లో 45% ఓట్లతో బీఆర్ఎస్ విజయం సాధించనున్నట్టు తేలింది. 41% ఓట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో, 9% ఓట్లతో బీజేపీ మూడో స్థానానికి పరిమితమవుతుందని క్యూమెగా అభిప్రాయపడింది.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో బరితెగించింది. హస్తంపార్టీ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి రిగ్గింగ్‌కు పాల్పడినట్టు వీడియోలను బట్టి అర్థమవుతున్నది. అయితే, కాంగ్రెస్ నేతలు ఎన్ని ప్రలోభాలకు దిగినా, ఎంత హడావుడి చేసినా ఫలితాన్ని నిర్దేశించే ఓటంతా ఉదయమే పడిపోయినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు, నిజంగా డబ్బుల ప్రభావం ఉండి ఉంటే, ఓట్ల శాతం భారీగా పెరిగేదని, అయితే జూబ్లీహిల్స్ గత అసెంబ్లీ ఎన్నికల్లో 47% పోలింగ్ నమోదైతే.. ఇప్పుడు అది 48.49 శాతానికి స్వల్పంగా పెరిగిందని గుర్తుచేస్తున్నారు. మైనార్టీ వర్గాలు ఎక్కువగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపాయని, సైలెంట్ ఓటర్లు బీఆర్ఎస్ వైపే ఉన్నట్టు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఏ మాత్రం బాగోలేదని తీర్మానించుకొన్న ఓటర్లు.. గులాబీకి బ్రహ్మరథం పట్టారని, తాజా ఎగ్జిట్‌పోల్స్‌తో అదే రుజువైందని తేల్చి చెప్తున్నారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, ఆయన సతీమణి మాగంటి సునీతపై ఉన్న సానుభూతి, అంతకుమించి కేసీఆర్ పదేండ్ల పాలనా పగతి వెరసి బీఆర్ఎస్కు కంచుకోటగా పిలిచే జూబ్లీహిల్స్ నియోజకవర్గం మళ్లీ కారు ఖాతాలోకి రావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నికకు సంబంధించి ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెల్లడించిన ‘కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్’ సంస్థకు అపారమైన విశ్వసనీయత ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. నిరుడు ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమికి 160 సీట్లు వస్తాయని కేకే సర్వేస్ అంచనా వేసింది. ఫలితాల్లో దాదాపు అవే గణాంకాలు నమోదయ్యాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని కేకే సంస్థ అంచనా వేయగా అదే నిజమైంది. మొత్తంగా ఇప్పటివరకూ కేకే సర్వే సంస్థ వెలువరించిన అంచనాలు 80%-85% వరకూ నిజమైనట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.