హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): జనసందోహంతో నర్సంపేట నాట్యమాడగా.. భద్రాచలం దద్దరిల్లింది. పినపాక గులాబీమయమైంది. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలతో సోమవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గులాబీ జాతర సాగింది. నర్సంపేట, బూర్గంపాడులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు జనం సునామీలా పోటెత్తారు. యువత, మహిళలు సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా వినటమే కాకుండా ఆయన అడిగే ప్రశ్నలకు హర్షధ్వానాలతో ఆమోదం తెలిపారు. అప్పారావుపేట గ్రామం, పినపాక, భద్రాచలం నియోజకవర్గ ప్రజలు బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో సీఎం కేసీఆర్ కోసం 3.30 గంటలు ఓపిగ్గా కూర్చొని, ఆసక్తిగా ఎదురుచూశారు.
ఆదివాసీగూడేల్లో గులాబీ గుబాళింపు
భద్రాద్రి-కొత్తగూడెం ఆదివాసీ జిల్లా. అడవుల జిల్లా. రాష్ర్టవ్యాప్తంగా ఇటీవల పంపిణీ చేసిన పోడుభూముల పంపిణీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాదే అగ్రస్థానం. అశ్వారావుపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించడం తొలిసారి కావడంతో ఆదివాసీ గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లోని ప్రజలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో సభకు హాజరయ్యారు. పినపాక నియోజకవర్గ సభలో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల ప్రజల సమస్యలను సీఎం ప్రస్తావించినప్పుడు భారీగా జన స్పందన రావడం విశేషం.
నర్సంపేట జనసంద్రం
పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభ పూర్తిగానే సీఎం కేసీఆర్ నేరుగా నర్సపేంట సభకు వచ్చారు. సభా ప్రాంగణంలో ఉన్నజనం కంటే బయట, నర్సంపేట పట్టణ రోడ్లన్నీ ప్రజలతో కిక్కిరిసిపోయాయి. మహిళలు, యువత పెద్దఎత్తున నర్సంపేట సభలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది. కళాకారుల ధూంధాంతో సభాప్రాంగణం ఉర్రూతలూగింది. ప్రజలు ‘హాట్రిక్ సీఎం కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ ప్రసంగానికి మద్దతుగా చప్పట్లు, ఈలలతో స్పందించారు. బీఆర్ఎస్తోనే పాకాల రైతుల కల సాకారం అయ్యిందని, పెద్ది సుదర్శన్ కారణంగానే గోదావరి జలాలు వచ్చాయని సీఎం కేసీఆర్ ప్రసంగంలో అన్నప్పుడు ఈలలు, చప్పట్లతో సభ దద్దరిల్లింది.