హైదరాబాద్, ఫిబ్రవరి 8(నమస్తేతెలంగాణ): మున్సిపల్ ఎన్నికల ప్రచారపర్వంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. మూడంచెల పకడ్బందీ వ్యూహంతో ఓటర్లలో చైతన్యం తెస్తున్నది. మున్సిపాలిటీల వారీగా ఇచ్చార్జిలను నియమించి పక్కా ప్రణాళికతో క్యాంపెయిన్‌ను హోరెత్తిస్తున్నది. గులాబీ అగ్రనేతలైన కేటీఆర్, హరీశ్‌రావు ప్రచారపర్వాన్ని తమ భుజాన వేసుకున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు సైతం ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆయాచోట్ల కాంగ్రెస్ గూండాల దాడులను ఎదిరించి తమ నియోజకవర్గాల పరిధిలోని మున్సపల్ కేంద్రాల్లో ప్రతిష్ఠాత్మక ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిం చారు.
కారుకు ఓటేసి మోసపూరిత కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని పిలుపునిస్తూ ముందుకుసాగుతున్నారు. ఇప్పటికే వార్డులు, డివిజన్ల అభ్యర్థులు సహా బీఆర్ఎస్ ముఖ్య నేతల నుంచి గల్లీ నాయకుల వరకు ప్రచార క్యాంపెయిన్‌లో మునిగిపోయారు. అభ్యర్థులు పట్టణ ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు తమదైన శైలిలో ప్రచారం చేపడుతున్నారు. మరోవైపు అమలుకాని కాంగ్రెస్ హామీలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు..గడపగడపకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు బొట్టుపెట్టి కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ చైతన్యం తెస్తున్నారు. ఇప్పటి మున్సిపల్ ప్రచారహోరు పతాకస్థాయికి చేరగా, సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనున్నది.
కేటీఆర్, హరీశ్‌రావు సుడిగాలి పర్యటన
గులాబీ పార్టీ అగ్రనేతలైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సుడిగాలి పర్యటనలు చేపడుతున్నారు. నిత్యం ఐదు లేదా ఆరు మున్సిపాలిటీలను చుట్టేస్తున్నారు. ఓటర్లతో మమేకమై గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. కేటీఆర్ ఇప్పటికే రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, ఉమ్మడి నిజమాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించారు. ఆదివారం తాండూరు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలోని బల్దియాల్లో జరిగిన ప్రచార సభల్లో పాల్గొన్నారు. కార్నర్ మీటింగ్‌లు నిర్వహించి ఓటర్లతో మమేకమవుతున్నారు. మహిళలు, యువతతో ముచ్చటించి సమస్యలసు తెలుసుకున్నారు. ప్రచార ర్యాలీల్లో పాల్గొని క్యాడర్లో జోష్ నింపారు. కాంగ్రెస్ చేసిన మోసాలను బహిరంగసభా వేదికలపై ఎండగడుతున్నారు. ఆరు గ్యారెంటీల పేరిట వంచించిన తీరును వివరిస్తూ ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందాలను ఎండగడుతున్నారు. మరోవైపు హరీశ్‌రావు వారం రోజులుగా అలుపెరగకుండా ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ పరిధిలోని సిద్దిపేట, గజ్వేల్, మెదక్, ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో పర్యటించారు. కాంగ్రెస్ రెండేండ్ల పాలన కుంభకోణాలకు నిలయంగా మారిందని ఆరోపణాస్త్రాలు సంధించారు. బీజేపీ తెలంగాణకు చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు విడమరిచి చెప్పారు. ఆదివారం పటాన్చెరువు, సదాశివపేట, జహీరాబాద్, సంగారెడ్డి, ఇంద్రేశం మున్సిపాలిటీల్లో ప్రచారం సాగించారు. ప్రచారంలో భాగంగా హరీశ్‌రావు సం గారెడ్డి జిల్లాలో ఆదివారం ఒకేరోజూ 15 కార్న ర్ మీటింగ్‌లో పాల్గొని రికార్డు సృష్టించారు.
అభ్యర్థులు ఫుల్ ఖుషీ!
మూడంచెల వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీ నేతల ప్రచారానికి విశేష స్పందన లభిస్తున్నది. కేటీఆర్, హరీశ్‌రావు నిర్వహించిన సభలు, సమావేశాలకు పెద్దసంఖ్యలో జనం కదిలివస్తున్నారు. వారి ప్రసంగాలను ఆసక్తిగా వినడం కనిపించింది. కాంగ్రెస్, బీజేపీ నేతలపై విసిరిన పంచ్‌లకు ఈలలు, చప్పట్లతో ప్రతిస్పందనలు మార్మోగాయి. కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి దుర్భాషలాడుడిన తీరుపై ప్రజలు పిడికిల్లెత్తి ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కాంగ్రెస్‌కు ఓటుతోనే బుద్ధిచెప్తామని హెచ్చరించారు. కేటీఆర్, హరీశ్‌రావు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ పార్టీ ఇన్చార్జిల ప్రచారజోరుతో అభ్యర్థులు సంతోషంగా ఉన్నారు. విజయం సాధిస్తామని ధీమా కనబరుస్తున్నారు. క్యాడర్లో సైతం ఉత్సా హం తొణికిసలాడుతున్నది. పార్టీ అభ్యర్థుల విజయానికి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు.
సీఎం ప్రచారానికి స్పందన కరువు
రాష్ట్రవ్యాప్తంగా సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సభలకు జనం నుంచి ఆశించిన స్పందన కనిపించలేదు. ముందస్తుగా వచ్చిన ప్రజల్లో నుంచి మధ్యలోనే పెద్ద సంఖ్యలో వెళ్లిపోవడం కనిపించింది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ సహా బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు తమ అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం పలు జిల్లాల్లోని బల్దియా ల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ నుం చి సీఎం రేవంత్‌రెడ్డి పలు జిల్లాల్లోని మున్సిపాలిటీలను చుట్టేశారు. అలాగే మెజార్టీ మంత్రులు తమ నియోజకవర్గాల పరిధిలోని బల్దియాల్లోనే మకాం వేసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సైతం పలు మున్సిపాలిటీల్లో ప్రచారం సాగించారు.
తేలిపోయిన బీజేపీ
మున్సిపల్ ప్రచారపర్వంలో బీజేపీ తేలిపోయింది. ఆ పార్టీ అభ్యర్థుల తరఫున కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ పార్టీ ఎంపీలు అర్వింద్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ తమ నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలను చుట్టేశారు. అయితే ఆ పార్టీ ప్రచారానికి ఒకటి, రెండుచోట్ల మినహా పెద్దగా స్పందన కనిపించలేదు. సంకల్ప యాత్రల పేరిట ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, పార్టీ మహామహులు సాగించిన ప్రచారం కూడా తేలిపోయింది. వారు నిర్వహించిన సభలకు అంతంత మాత్రంగానే జనం హాజరయ్యారు.
కాంగ్రెస్ గూండాల దాడులను ఎదిరించి..
అధికారపార్టీ గుండాల దాడులను ఎదిరిస్తూనే ప్రచారపర్వంలో ముందుకుసాగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో అధికారపార్టీ అరాచకపర్వానికి ఎదురొడ్డి నిలిచింది. సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి కనుసన్నల్లో దాడులకు దిగినా, చంపేస్తామని బెదిరించినా వెనుదిరగలేదు. బీఆర్ఎస్ అభ్యర్థులను అపహరించేందుకు చేసిన యత్నాలను నిలువరించారు. పార్టీ ఇన్చార్జి పట్నం నరేందర్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ గుండాల దాడులను దీటుగా తిప్పికొట్టారు. అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ కేంద్రం గజ్వేల్‌లో కాంగ్రెస్ గుండాల దౌర్జన్యకాండను దీటుగా తిప్పికొట్టారు. మేడ్చల్ మున్సిపాలిటీలో ప్రచారానికి వెళ్లిన మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రిరాజశేఖర్ పార్టీ దళితనేతపై కాంగ్రెస్ గుండాల దాడులకు దిగినా వెరవకుండా ముందుకుసాగారు. మంచిర్యాలలో హరీశ్‌రావు ర్యాలీకి ఆటంకం కల్పించేందుకు కాంగ్రెస్ నేతల కుట్రలను దీటుగా తిప్పికొడుతూ ముందుకుసాగారు.