హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): పదేండ్ల పాలనలో కేసీఆర్ అన్నపూర్ణగా తీర్చిదిద్దిన తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మారుస్తారా? అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో రైతన్నలు, ఆటోడ్రైవర్లు, చేనేతన్నలు ఎం తోమంది ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట తెలంగాణ రియల్ ఎస్టేట్ను కాంగ్రెస్ కుదేలు చేసిందని విమర్శించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టిన పెట్టుబడులురాక, మిత్తి కూడా చెల్లించలేని స్థితిలో ఉసురు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్ల పాలనలో కేసీఆర్ వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చి రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపారని పేర్కొన్నారు. రేవంత్ పాలనలో సాగునీళ్లు లేక, కరం టు రాక, పంటలు కొనుగోలు చేయక, రైతుభరోసాలేక, రుణమాఫీకాక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజాపాలన కాదని, ప్రజలను వేధించే పాలన అని దుయ్యబట్టారు.