హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధికారంగా పరిగణించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టుకు ఉద్దేశాలు ఆపాదించేలా కామెంట్స్ చేసిన బండి సంజయ్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం కాంగ్రెస్, బీఆర్ఎస్ విజయమంటూ బండి సంజయ్ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ ఖండించారు. కాంగ్రెస్ లాయర్ చేసిన కృషితో ఒకరికి బెయిల్ వస్తే, బీఆర్ఎస్ మద్దతు కారణంగా ఆ న్యాయవాది రాజ్యసభలో స్థానం పొందారంటూ సంజయ్ వివాస్పద వ్యాఖ్యలు చేసిన విషయాన్ని కేటీఆర్ ఉటంకించారు. వైన్ అండ్ డైన్ క్రైమ్‌లో పార్టనర్స్ అయిన కాంగ్రెస్, బీఆర్ఎస్కు కంగ్రాట్యులేషన్స్ అంటూ బండి సంజయ్ తన స్థాయిని మరిచి సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రమంత్రిగా ఉంటూ చౌకబారుగా మాట్లాడతారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ లిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపితమని తేలిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పష్టంచేశారు. ఎమ్మెల్సీ కవితకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తే కాం గ్రెస్, బీజేపీ నేతలకు ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్లో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు సోమ భరత్‌కుమార్, పల్లె రవికుమార్గౌడ్తో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఆధారాల్లేని కేసులో ఐదు నెలలు జైల్లో ఉంచడం బాధాకరమని, సు ప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేరొన్నారు. బెయిల్ అంశాన్ని రెండు రాజకీయ పార్టీల ఒప్పందంగా పేరొనడం కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని, ఈ వ్యాఖ్యలు కోర్టు ధికరణ కిందకే వస్తాయని స్పష్టంచేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలు బయటపడినా ఈడీ చర్యలేవని ప్రశ్నించారు.
ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ ద్వారా బీజేపీ కక్షసాధింపు చర్యలు బట్టబయలయ్యాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కవితపైకి బీజేపీ ప్రభుత్వం ఈడీని ఉసిగొల్పి కేసు పెట్టించటం వల్ల అకారణంగా ఆమె నెలలుగా జైల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సీఆర్ పదే పదే చెప్తున్నట్టు కవిత కడిగిన ముత్యంలా బయటికి వస్తారని చెప్పారు.
చేయని నేరానికి ఎమ్మెల్సీ కవితను అక్రమ కేసుల్లో ఇరికించి, ఐదు నెలల పాటు బెయిల్ రాకుండా అడ్డుకున్నారని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కవితకు బెల్ మంజూరుపై ఓ ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ఈ తప్పుడు కేసును సుప్రీంకోర్టు కొట్టివేయాలని కోరారు. కవితకు బెయిల్ వస్తే బండి సంజయ్ ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కావడం లేదని, ఆయన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించాలని క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు.
న్యాయమే గెలిచిందని, కవిత బెయిల్‌పై బయటకు రావడం సంతోషమని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం పేరుతో లేనిది సృష్టించి కవితను బీజేపీ జైలుకు పంపి ఇబ్బంది పెట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు. కవిత వందశాతం నిరపరాధి అని, కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్న నమ్మకం తమకున్నదని చెప్పారు. బీజేపీ సర్కారు దమనకాండకు ముగింపు పలకాలని అన్నారు.
చేయని తప్పులో అన్యాయంగా ఇరికించినా ఎంతో ధైర్యంతో ఎమ్మెల్సీ కవిత ఫైటర్‌లా పోరాడారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. కవితకు బెయిల్ మంజూ రు చేసిన సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఈడీ, సీబీఐల దర్యాప్తు తీరును తీవ్రంగా ఆక్షేపించాయని చెప్పారు. వారి వ్యాఖ్యలతో ఈ కేసు నిలవదని స్పష్టమైందని తెలిపారు. బీజేపీతో పొత్తులో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ నేతలు మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఢిల్లీ మద్యం పాలసీతో ఏ మాత్రం సంబంధం లేకున్నా తమ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఈడీ అక్రమంగా కేసు బనాయించి 165 రోజులు అన్యాయంగా జైల్లో ఉంచడం బాధాకరమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన సుప్రీంకోర్టు వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రజాప్రతినిధిగా ఉన్న కవితను ఇతర సామాన్య ఖైదీలా చూడటాన్ని కూడా న్యాయస్థానం తప్పుబట్టిందని చెప్పారు.