ములుగు, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ములుగుజిల్లా ములుగు నియోజకవర్గంలో జరిగిన రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పారని, బీఆర్ఎస్ హవా నడిచిందని రెడో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీతక సొంతూరు జగ్గన్నపేటలో నాయకులను భయపెట్టి కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిని సర్పంచ్‌గా ఏకగ్రీవం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థికే ఉప సర్పంచ్ పదవి ఇచ్చారంటే బీఆర్ఎస్ బలం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు. మంత్రి సీతక వెయ్యి మంది ఓటర్లు కూడా లేని గ్రామాల్లోకి వెళ్లి 200 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రజలను మభ్యపెట్టారని, పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. అయినప్పటికీ ఏటూరునాగారం వంటి కీలక పంచాయతీని బీఆర్ఎస్ కైవసం చేసుకుందని గుర్తుచేశారు. రెండు విడతల్లో కాంగ్రెస్‌కు 42వేల ఓట్లు వస్తే.. బీఆర్ఎస్కు 37వేల ఓట్లు వచ్చాయని, రెండు పార్టీలకు మధ్య 5వేల ఓట్ల తేడా మాత్రమే ఉన్నదని చెప్పారు. కేసీఆర్‌పై ప్రేమతో బీఆర్ఎస్కు ఓటేసిన ప్రజలకు, ఎన్నికల్లో పోరాడిన అభ్యర్థులకు ధన్యవాదాలు తెలిపారు.