BRS Party | హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల సాధనకు మద్దతుగా ఈ నెల 18న బీసీ జేఏసీ చేపట్టబోయే బీసీ బంద్‌లో పాల్గొంటామని బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీసీ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో వీరు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ భవన్ నుంచే వెళ్లి బీసీ బంద్‌లో పాల్గొంటాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ డ్రామా చేయడానికి చూసింది. కానీ ఆ డ్రామా వర్కవుట్ కాలేదు. మేము అసెంబ్లీ లోనే చెప్పినం.. ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందని. కుల గణన సరిగా జరగలేదు. కులగణన సర్వే పత్రంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం తప్పు అని వారు పేర్కొన్నారు.
గవర్నర్ వద్దకు తీర్మానం వెళ్ళక ముందే ఢిల్లీలో ధర్నా చేశారు. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ధర్నాకు రాలేదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారు. పార్టీల పరంగా ఎన్నికలకు వెళ్తామంటే తాము ఒప్పుకోమన్నారు. 42 శాతం రిజర్వేషన్ ఇచ్చాకనే ఎన్నికలకు వెళ్లాలి. చట్ట పరంగా షెడ్యూల్ 9 ప్రకారం ఎన్నికలకు పోవాలి. ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్లు వ్యవహారిస్తే తీవ్ర పరిమాణాలు ఉంటాయని హెచ్చరించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వారి వెంట పడుతూనే ఉంటాం. 17 నెలల నుంచి కాంగ్రెస్ నిద్ర పోయింది. చట్టమే లేనిది జడ్జిలు తీర్పు ఎలా ఇస్తారు. అందరూ ఈ నెల 18వ తేదీన న బంద్‌కు సహకరించాలి. ప్రతి బీసీ బిడ్డ బంద్‌లో పాల్గొనాలని తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.