BRS | హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై అనర్హతవేటు విషయంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నది. ప్రజాతీర్పునకు విరుద్ధంగా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అన్ని కోణాల్లో న్యాయ సలహా, సంప్రదింపులు జరుపుతున్నది. తమ ఫిర్యాదులను స్పీకర్ పట్టించుకోని కారణంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన సమయంలోనే ఆయనపై అనర్హతవేటు వేయాలని స్పీకర్‌ను కోరింది.
స్పీకర్ తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం వెల్లడించకపోడంతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర హైకోర్టు తలుపుతట్టింది. పార్టీ ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకొని, సదరు ఎమ్మెల్యేపై అనర్హతవేటు వేయాలనే నిబంధన ఉన్నది. ఎమ్మెల్యేల అనర్హతల విషయంలో స్పీకర్ నిర్ణయం, హైకోర్టు తీర్పు వెలువడని పక్షంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. దానం నాగేందర్‌తోపాటు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ సంజయ్ తదితరులు పార్టీ మారినందున వారిపై కూడా అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించే దిశగా సమాలోచనలు జరుపుతున్నది.