బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వ పార్టీ. ఇది తెలంగాణ ప్రజల పార్టీ. బీఆర్ఎస్ను తమ సొంత ఇంటి పార్టీగా తెలంగాణ ప్రజలు భావిస్తారు. ప్రజలు ఇవ్వాళ అనేక కష్టాల్లో ఉన్నారు. బీఆర్ఎస్సే తమ రక్షణకవచమని జనం నమ్ముతున్నారు.
– కేసీఆర్
KCR | హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటినుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్సే తెలంగాణ సమాజానికి రక్షణ కవచమని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. ఈ విషయం గత 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందని, రాష్ట్ర ప్రభుత్వం పట్ల తెలంగాణ సమాజంలో నెలకొన్న అసంతృప్తి, అనిశ్చితే నిదర్శనమని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించేలా పార్టీ రజతోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 27 నాటికి పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో నిర్వహించే వేడుకల్లో భాగంగా వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. వరంగల్ సమీపంలో విశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభా వేదిక స్థలాన్ని నిర్ణయించనున్నట్టు కేసీఆర్ తెలిపారు.
ఎర్రవెల్లిలోని నివాసంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ కీలక నేతల సమావేశంలో వివిధ అంశాలపై ఎనిమిది గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దశాబ్దాలపాటు పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని, పదేండ్లపాటు ఎంతో అప్రమత్తతో పాలన సాగించి దేశానికే ఆదర్శంగా నిలుపుకున్నామని, అంతటి గొప్ప ప్రగతిని సాధించిన తెలంగాణ సమాజం ఇవాళ కష్టాల్లో ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కంకణబద్ధులమై మరింతగా పోరాడుదామని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇటువంటి సందర్భంలో నిర్వహించుకుంటున్న రజతోత్సవాలు బీఆర్ఎస్కే పరిమితం కాదని, యావత్ తెలంగాణ సమాజానికి అందులో భాగస్వామ్యం ఉన్నదని స్పష్టంచేశారు.
తెలంగాణకు కేంద్రం వ్యతిరేకమే
కేంద్రం ప్రభుత్వంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా తెలంగాణ సమాజానికి మొదటినుంచీ అవి వ్యతిరేకంగానే పని చేస్తున్నాయని సమావేశంలో ఆవేదనవ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసుకొని దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల నిత్యం అప్రమత్తతతో ఉండాలని సమావేశంలో పార్టీ నిర్ణయించింది. తెలంగాణ ఇంటి పార్టీ ప్రాతినిధ్యం పార్లమెంట్లో లేకపోవడం వల్ల తెలంగాణ హకులకు భంగం వాటిల్లుతున్నదని అభిప్రాయపడింది. ఇదే విషయం ప్రజలకు మరింతగా బోధపడేలా పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీల ప్రాతినిధ్యం ఉండి రాష్ట్ర హకులను కాపాడుకునే దిశగా ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాలని సమావేశంలో నిర్ణయించింది. ఎనిమిది గంటలపాటు సాగిన సుదీర్ఘచర్చలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరులను తిప్పి కొడుతూ తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ అధ్యక్షతన సాగిన సమావేశం నిర్ణయించింది.
కాంగ్రెస్ పాలనలో తెర్లవుతున్న తెలంగాణ
చర్చ సందర్భగా పలు అంశాలపై కేసీఆర్ అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నేతలు తమ అభిప్రాయాలను అధినేత ముందుంచారు. కాంగ్రెస్ 14 నెలల పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఉమ్మడి పాలన తరహాలో మళ్లీ కరెంట్ కోతలు, తాగునీటి కష్టాలు మొదలయ్యాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో రేవంత్‌రెడ్డి సర్కారు పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించపోవడంతో కాంట్రాక్టర్లు సచివాలయంలో డిప్యూటీ సీఎం చాంబర్ ఎదుట ఆందోళన చేసే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. విశ్రాంత ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం హైకోర్టు మెట్లు ఎక్కాల్సిన దుస్థితి దాపురించిందని చెప్పారు. ఆదాయ రాబడిలో తెలంగాణను మనం నంబర్‌వన్‌గా తీర్చిదిద్దితే, నేడు రియల్ ఎస్టేట్ నేల కరించిందని తెలిపారు. సాగునీళ్లు అందక పచ్చని పంటలు ఎండిపోవడాన్ని చూసి తట్టుకోలేక రైతులు ఎడ్చే దారుణ పరిస్థితి కాంగ్రెస్ రాజ్యంలో నెలకొన్నదని నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు.
యువత, మహిళా భాగస్వామ్యం పెంచాలి
పార్టీలో యువత, మహిళా భాగస్వామ్యం పెంచాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంతోపాటు దేశంలో వర్తమాన రాజకీయ పరిస్థితులు, అందుకనుగుణంగా పార్టీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు, అమలుచేయాల్సిన రాజకీయ ఎత్తుగడలపై లోతైన చర్చ జరిగింది. గత ఒడిదొడుకులను, అనుభవాలను పరిగణలోకి తీసుకుని విశ్లేషిస్తూ, వర్తమానానికి అన్వయించుకుంటూ భవిష్యత్తుకు బాటలువేసుకునేలా కార్యాచరణను అమలు చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా కొత్త కమిటీలు
కాంగ్రెస్ ఆశపెట్టిన ఆరు గ్యారెంటీలను, 420 హామీలను నమ్మిన ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని తెలిపారు. సభ సన్నాహక సమావేశాలను నియోజకవర్గాలవారీగా నిర్వహించాలని, అందుకు త్వరలో కమిటీలను వేయనున్నామని కేసీఆర్ చెప్పారు. వరంగల్ సభ తర్వాత పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సంస్థాగతంగా పటిష్ట పరిచి, కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం నూతన కమిటీల బాధ్యులతో ప్రతినిధుల సభను నిర్వహించనున్నట్టు కేసీఆర్ వెల్లడించారు.