హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రను చెరిపివేసేందుకు కుట్ర జరుగుతున్నదని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత మధుసూధనాచారి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను చెరిపివేయడం ఎవరి తరం కాదని స్పష్టంచేశారు. ఎవరో దయతల్చి రాష్ర్టాన్ని ఇచ్చారని చెప్పడమంటే తెలంగాణ ప్రజలను అవమానించడమేనని పేర్కొన్నారు.
బుధవారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మధుసూధనాచారి మాట్లాడుతూ.. కేసీఆర్ వీరోచితంగా పోరాడి తెలంగాణ సాధించారని, ఉమ్మడిపాలనలో తెలంగాణ అనే పదం నిర్బంధం ఉన్న రోజుల్లోనే ఆయన బీఆర్ఎస్ను స్థాపించారని చెప్పారు. తెలంగాణ సాధనకు, కేసీఆర్‌కు సంబంధం లేదనే దుష్టప్రయత్నం చేయడం క్షమించరానిదని మండిపడ్డారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, విద్యుత్, సాగునీరు, తాగునీరు, వైద్యం వంటి రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని వివరించారు. బడ్జెట్లో అనేక అవాస్తవాలు, వక్రీకరణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేనట్టు కనిపిస్తున్నదని మండిపడ్డారు. ‘ఆంజనేయుడి తోక మాదిరిగా హామీలు.. కొండంగి తోక మాదిరిగా లోపాలు.. కోతి తోక మాదిరిగా కేటాయింపులు’ ఉన్నాయని ఎద్దేవా చేశారు. పరిపాలన అంటే బురదజల్లే ఏకవాక్య తీర్మానం కాదని చురకలేశారు. రాబోయేరోజుల్లో అప్పులు చేయకుండా ప్రభుత్వాన్ని నడుపుతామన్న హామీ ఇవ్వగలరా? అని ప్రశ్నించారు.