హైదరాబాద్: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి నేపథ్యంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ (BRS) విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన శేరిలింగపంల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసంలో భేటీ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు నివాసం నుంచి పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు గాంధీ నివాసానికి బయల్దేరనున్నారు. సమావేశానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు.
దీంతో ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్సీని హౌస్ అరెస్టు చేశారు. బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. రాజు ఇంటికి వస్తున్న కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. అదేవిధంగా శేరిలింగంపల్లిలోని గాంధీ నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు, పెద్య సంఖ్యలో వ్యాన్లను సిద్ధం చేశారు.