BRS Party | హైదరాబాద్ : కాంగ్రెస్ బాకీ కార్డును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కలిసి విడుదల చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, పద్మారావు గౌడ్, మధుసూదనాచారి, జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
22 నెలల పాలనలో మహిళలకు రూ. 2500 హామీ కింద ఒక్కొక్కరికి రూ. 55 వేలు, వృద్ధులకు పెన్షన్ నెలకు రూ. 4 వేల హామీ కింద ఒక్కొక్కరికి రూ.44 వేలు, వికలాంగులకు పెన్షన్ రూ. 6 వేల హామీ కింద ఒక్కొక్కరికి రూ. 44 వేలు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి కింద ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడినట్లు బీఆర్ఎస్ పేర్కొంది. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థినులకు స్కూటీ కూడా బాకీగా మిగిలి ఉన్నాయని తెలిపింది. విద్యా భరోసా కార్డ్ కింద విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది.