BRS | హైదరాబాద్/మహబూబ్‌నగర్ అర్బన్/సిద్దిపేట టౌన్/రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): బడుగువీరులకు గొడుగు పట్టింది కేసీఆరేనని బీఆర్ఎస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ 374వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న చిత్రపటానికి మాజీ మంత్రులు వీ శ్రీనివాస్‌గౌడ్, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు పల్లె రవికుమార్, ఆంజనేయగౌడ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, రామమూర్తి, రాంనర్సింహగౌడ్ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని గతంలో ఎవరూ నిర్వహించలేదని, తెలంగాణం సాధించిన తరువాత కేసీఆర్ బడుగు, బలహీనవర్గాల వీరులకు, త్యాగధనులకు సముచి గౌరవం ఇచ్చారని చెప్పారు. సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ సహా అనేకమంది త్యాగధనుల జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని గుర్తుచేశారు. సర్వాయి పాపన్న విగ్రహానికి నిధులు కేటాయించారని, ట్యాంక్‌బండ్‌పై, అసెంబ్లీ ప్రాంగణంలోనూ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సామాన్యులందరూ సమానత్వంతో బతకాలని తన జీవితాన్ని పోరాటంగా మలచుకొన్న సర్వాయి పాపన్న ఆదర్శ ప్రాయుడని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.
జిల్లాకు సర్వాయి పాపన్న పేరు..: కేటీఆర్
సిరిసిల్ల పట్టణంలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సర్వాయి పాపన్న జయంతిలో పాల్గొన్నారు. మొదటి బైపాస్‌రోడ్డులోని నర్సింగ్ కళాశాల చౌరస్తాలో పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. బహుజన రాజ్యం కోసం, తెలంగాణపై నిరుంకుశ శక్తులకు వ్యతిరేకంగా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న పేరును జనగామ లేదా మరే జిల్లాకైనా నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సర్వాయి పాపన్న ఆశయాలను సాధించే దిశగా గత కేసీఆర్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని గౌడన్నలకు తాటి, ఈత చెట్ల పన్నులు, గతంలో ఉన్న బకాయిలన్నింటినీ పూర్తి స్తాయిలో మాఫీ చేసిందని గుర్తుచేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేసీఆర్ హయాంలో గౌడ కులస్థులకు చేయూత అందిస్తే.. కాంగ్రెస్ సర్కారు గీత కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నదని ఆరోపించారు.