BRS | రాష్ట్రంలో ఆందోళనకర స్థాయికి చేరిన రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితులపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 9 మందితో కూడిన అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది సభ్యులు గల ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో నెలకొన్న దుర్భర పరిస్థితులను అధ్యయనం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ మంత్రికి, వ్యవసాయ కమిషన్కు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు నివేదిక అందిస్తుందని తెలిపారు.
రెండు వారాల పాటు విస్తృతంగా పర్యటించిన అనంతరం, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలకు దారితీస్తున్న ప్రధాన కారణాలతో పాటు గత ఏడాది వ్యవసాయ సంక్షోభానికి దారితీసిన పరిస్థితులను పరిశీలించి నివేదికను రూపుదిద్దుతుందని కేటీఆర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో సన్న, చిన్న, కౌలు రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటామని తెలిపారు.
రాష్ట్ర రైతాంగానికి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఏడాది పాలనలో రైతు ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 400 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇది ఆందోళనకర పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన రైతు రుణమాఫీ కనీసం 30 శాతాన్ని కూడా దాటకపోవడం, గతంలో అందిన రైతుబంధును ఆపివేయడం, ఇస్తామన్న 15 వేల రూపాయల రైతు భరోసా సైతం రద్దు చేయడం వంటి ముఖ్యమైన ఆర్థిక సమస్యలు రైతు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని తెలిపారు. అలాగే, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా, సకాలంలో సాగునీటి వసతి కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ కారణంగా రైతులు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిందని విమర్శించారు.
రైతన్నలను, వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకుండా దిక్కులు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేలా ప్రధాన ప్రతిపక్షంగా తమ వంతు పాత్ర పోషించాలన్న ఉద్దేశంతో ఈ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. 10 సంవత్సరాల పాటు రైతును రాజును చేసే లక్ష్యంతో పనిచేసిన బీఆర్ఎస్, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ప్రయత్నిస్తుందని అన్నారు. విస్తృత అధ్యయనం అనంతరం, పార్టీ తరఫున రూపొందించే నివేదికను ప్రభుత్వానికి అందజేసి, రానున్న బడ్జెట్ సమావేశాల్లో రైతు సమస్యలపై, వారికి ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
కమిటీ సభ్యులు:
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జోగు రామన్న, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, అంజయ్య యాదవ్ సభ్యులుగా ఉన్నారు.