BRS Party | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన మోసాలు, పొడిచిన వెన్నుపోట్లను ఈ తెలంగాణ ఎన్నటికీ మరిచిపోదు అని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. మాట తప్పి, మడమ తిప్పి, తెలంగాణ ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారికి స్వాగతం.. సుస్వాగతం తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా స్పందించింది.
ఆలూ లేదు – చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్లు.. అధికారం కోసం ఎన్నికలకు ముందు అందమైన పేర్లు పెట్టి అంతులేని హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 2022 మే 6న వరంగల్లో జరిగిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ రైతులకు రుణాలు మాఫీ, పంటలకు కనీస మద్దతు ధర, రైతులకు ఎకరానికి రూ. 15,000 ఆర్థిక సహాయం పేరుతో రైతు డిక్లరేషన్ ప్రకటించారు. 2023 అక్టోబరులో చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో 15 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు. 2023 నవంబర్లో హైదరాబాద్ సరూర్ నగర్లో నిర్వహించిన బహిరంగ సభలో యూత్ డిక్లరేషన్ కింద అధికారం దక్కిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల, ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ, నిరుద్యోగులకు నెలకు రూ.4 వేలు భృతి, మెగా డీఎస్సీ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ , యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీ అంటూ ప్రకటించిన ప్రియాంక గాంధీ. సెప్టెంబర్ 17, 2023 తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు ఆరు గ్యారంటీలు ప్రకటించారని, కానీ వాటిని అమలు చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ మండిపడింది.
మహాలక్ష్మి పేరుతో మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం.. రూ. 500కు గ్యాస్ సిలిండర్. రైతు భరోసా పేరుతో రైతులు మరియు కౌలు రైతులకు ఏటా రూ. 15,000 సహాయం. రైతు కూలీలకు రూ. 12,000 బోనస్.. రైతు బీమా పథకం. గృహ జ్యోతి పేరుతో అన్ని గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో సొంత ఇల్లు లేనివారికి రూ. 5 లక్షల విలువైన ఇళ్లు. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం. చేయూత పేరుతో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, రైతు కూలీలు, వికలాంగులకు నెలకు రూ. 4,000 పెన్షన్. ఆరోగ్య బీమా కవరేజ్ రూ. 10 లక్షల వరకు. యువ వికాసం పేరుతో విద్యార్థులకు రూ. 5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉచిత విద్య, వసతి. ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు అని మొత్తం 420 హామీలు ఇచ్చారు. తెలంగాణాలో అధికారం దక్కిన తర్వాత దేశమంతా రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరుగుతూ ప్రజాస్వామ్యం, హక్కుల గురించి ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణలో అపహాస్యం అవుతున్న రాజ్యాంగం గురించి మాట్లాడటం లేదు అని బీఆర్ఎస్ పార్టీ ధ్వజమెత్తింది.
ఏడాదిన్నర తర్వాత తెలంగాణకు వస్తున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి స్వాగతం పలుకుతూ.. మీరు ఇచ్చిన హామీలు, ప్రకటించిన గ్యారంటీలు మీకైనా గుర్తున్నాయా? అని ఒకసారి గుర్తు చేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలు
మీకు గుర్తున్నా .. లేకపోయినా.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన మోసాలు, పొడిచిన వెన్నుపోట్లు..ఈ తెలంగాణ ఎన్నటికీ మరిచిపోదు. హామీల అమలుపై తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిలదీస్తూనే ఉంటుంది అని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది.