ఖమ్మం, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం జిల్లాలోని (Khammam) ఇద్దరు కీలక మంత్రులకు పల్లె ఓటర్లు షాకిచ్చారు. బీఆర్ఎస్, సీపీఎం కూటమికి జైకొట్టి ఖమ్మం చైతన్యాన్ని చాటిచెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి (Bhatti Vikramarka), మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి (Ponguleti Srinivas Reddy) గుబులు పుట్టించారు. మలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్-సీపీఎం కూటమి హవా కొనసాగుతున్నది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత స్పష్టమైనట్టు రుజువైంది. మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజర్గ పరిధి ముదిగొండ మండలంలో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గ పరిధి నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల పరిధిలో అనేక గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ పార్టీ విజయదుందభి మోగించింది. ఖమ్మంరూరల్ మండలంలోని 19 పంచాయతీల్లో 10 స్థానాల్లో బీఆర్ఎస్, సీపీఎం కూటమి విజయం సాధిం చింది. అన్ని పంచాయతీ వార్డుల్లో బీఆర్ఎస్, సీపీఎం అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. మధిర నియోజకవర్గం ముదిగొండ, ఇల్లెందు నియోజకవర్గంలో కామేపల్లి మండలంలో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది.
ఖమ్మం రూరల్ మండలంలోని 19 పంచాయతీల్లో 10 పంచాయతీల్లో బీఆర్ఎస్, సీపీఎం కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఎం వెంకటాయపాలెం, పొన్నెకల్ గ్రామాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఖాతా తెరవలేకపోయారు. వెంకటాయపాలెంలోని 10 వార్డుల్లో 5 బీఆర్ఎస్, 5 సీపీఎం గెలుచుకున్నాయి. పొన్నెకల్‌లో బీఆర్ఎస్ కూటమి సర్పంచ్ పదవితోపాటు 8 వార్డులను గెలుచుకున్నది. కాంగ్రెస్ ఒక్క వార్డునూ గెలువలేక చతికిలపడింది.
పాలేరు నియోజకవర్గంలోని మేజర్ గ్రామ పంచాయతీ, మండల కేంద్రం అయిన నేలకొండపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. మండల కేంద్రమైన ముదిగొండలో సీపీఎం అభ్యర్థి విజయం సాధించారు. తిరుమలాయపాలెం మండలంలోనూ కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ బ్రేకులు వేసింది. 25 పంచాయతీల్లో బీఆర్ఎస్ కూటమి 10 గెలుచుకున్నది.

ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 14: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ హవా కొనసాగింది. కొన్నిచోట్ల అధికార కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడింది. ముఖ్యమైన స్థానాల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. భద్రాద్రి జిల్లాలో 154 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 16 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఆదివారం 138 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 32 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. 84 స్థానాలను కాంగ్రెస్ ‘చే’జిక్కించుకుంది. సీపీఐ 18, సీపీఎం 5 చోట్ల గెలిచాయి. ఇతరులు 15 స్థానాల్లో తమ బలాన్ని నిరూపించుకున్నారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో 10 సర్పంచ్ స్థానాలకుగాను రెండు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఎనిమిది స్థానాల్లో ఎన్నికలు జరుగగా.. నాలుగు స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. అన్నపురెడ్డిపల్లి మేజర్ పంచాయతీలో కాంగ్రెస్ దిగ్గజాలు మద్దతు తెలిపినా 12 వార్డులకుగాను 11 వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
ములకలపల్లి మండలంలో 19 సర్పంచ్ స్థానాలకుగాను బీఆర్ఎస్ 6 స్థానాలను గెలుచుకొని మొదటి వరుసలో నిలిచింది. కాంగ్రెస్ కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది. ఇతరులు తొమ్మిది సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇలాకా, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న అశ్వారావుపేట నియోజకవర్గంలో రెండుచోట్ల మాత్రమే కాంగ్రెస్ మెజారిటీని తెచ్చుకోవడం గమనార్హం. కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్, సీపీఐ ‘నువ్వా-నేనా’ అనేలా పోటీపడ్డాయి. ఇక ఖమ్మం జిల్లాలో మొత్తం 183 పంచాయతీలుండగా.. ఇప్పటికే 23 ఏకగ్రీవమయ్యాయి. వీటిల్లో బీఆర్ఎస్-1, కాంగ్రెస్-19, సీపీఐ-2, మాస్‌లైన్ ప్రజాపంథా-1 చొప్పున దక్కించుకున్నాయి. 160 స్థానాల్లో ఎన్నికలు జరుగగా.. బీఆర్ఎస్ (సీపీఎం కూటమి) 55, కాంగ్రెస్ 102 స్థానాలు గెలుచుకున్నాయి. ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. ఒకస్థానంలో టై జరిగింది.