BRS Party | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మానవ హక్కులకు భంగం వాటిల్లుతొందని, విచారణ జరిపి మానవ హక్కులను కాపాడాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ నాయకులందరం ఇవాళ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌ను మర్రి చెన్నా రెడ్డి మానవ హక్కుల ఇనిస్టిట్యూట్‌లో కలిసి ఫిర్యాదు చేసినట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
లగచర్లలో అన్యాయంగా ఎస్టీల భూములు లాక్కొని, మహిళలను కొట్టి జైలుకు పంపారని, ఇప్పటివరకు వారికి ఎలాంటి పరిహారం చెల్లించలేదని ఎన్హెచ్ఆర్సీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో గత 20 నెలల్లో 100 మంది విద్యార్థులు గురుకులాల్లో ఆత్మహత్య చేసుకుని మరణించారని, వందలాది చోట్ల విషాహార ఘటనలు సంభవించాయని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జర్నలిస్టులపై అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతూ జైలుకు పంపారని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి సొంత కేబినెట్ మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీ నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకులు తమకు జరిగిన అన్యాయాలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని తెలిపారు. బీఆర్ఎస్ ఫిర్యాదులను నమోదు చేయకుండా, కాంగ్రెస్ నాయకుల కేసులు మాత్రం పరువు నష్టం కేసు కింద నమోదు చేస్తున్నారని, సోషల్ మీడియాలో కేవలం రీ ట్వీట్ చేసినందుకు నల్ల బాలు అనే ట్విట్టర్ హ్యాండిల్ ఉన్న వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని తెలిపారు.
రహస్యంగా జరిగే విచారణకు సంబంధించిన వివరాలను మీడియా సంస్థలకు అక్రమంగా విడుదల చేసి, ప్రతిపక్ష పార్టీ నాయకులపై బురద జల్లే కుట్ర చేస్తున్నారన్నారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,15(2),19,21,35(e) ప్రకారం హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. భారత న్యాయసంహిత ప్రకారం సెక్షన్ 35(3),354,354A,354B,108 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం 1989, ఐటి చట్టంలోని సెక్షన్ 67, భారత టెలిగ్రాఫ్ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, పై విషయాలపై స్వతంత్ర న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశామని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ప్రత్యేకించి పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరించడాన్ని నిరోధించాలని కమిషన్‌ను కోరినట్లు తెలిపారు.