Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలో ఎవరెన్ని ట్రిక్స్ చేసినా హ్యాట్రిక్ కేసీఆర్‌దేనని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రానికి స్ట్రాంగ్ లీడర్ కావాలా..? రాంగ్ లీడర్ కావాలా..? ఎవరు కావాలో ప్రజలు, మేధావులు ఆలోచించాలని మంత్రి సూచించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ రావు మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆధర్యంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా బీఎన్ రావుకు మంత్రి హరీశ్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వివిధ జిల్లాలకు చెందిన ఐఎంఏ అధ్యక్షులు, 70 మంది డాక్టర్లు బీఆర్ఎస్లో చేరారు.
చేరికల అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఒకనాడు నాడు ఎంబీబీఎస్ చదవాలంటే ఇతర దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. కానీ నేడు తెలంగాణలో ఉంటూనే ఎంబీబీఎస్ చదివే అవకాశం దక్కిందన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. మన రాష్ట్ర విధానాన్ని చూసి కేంద్రం ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ విధానాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ప్రజలకు మంచి చేసే పనులు పత్రికల్లో ఎక్కువగా కనపడవు కానీ ఎదుటి వారిని తిడితే వార్తల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని, రాష్ట్రానికి పేపర్ లీడర్ కావాలా, ప్రాపర్ లీడర్ కావాలా ప్రజలు ఆలోచించాలి ఆయన సూచించారు.
తెలంగాణ ఫార్మా హబ్‌నే కాకుండా నేడు హెల్త్ హబ్, ఐటీ హబ్‌గా ఎదిగిందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానంలో ఉందని, వైద్యుల ఉత్పత్తిలోనూ నెంబర్ వన్‌గా ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2014లో 30శాతం డెలివరీలు జరిగితే, నేడు 72.8 శాతానికి పెరిగాయని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సూడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, బీఆర్ఎస్ నాయకుడు భూపతి రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో రామ్ మోహన్, శ్రీధర్, పృధ్విదర్, సంపత్ రావు, అరుణ్, కృష్ణాదాస్, వంశీ, రాములు, రాజ్ కుమార్, చంద్రశేఖర్ తదితరులున్నారు.