హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తొలి విడత పంచాయతీ (Panchayathi Elections) పోరులో గులాబీ దళం (BRS) హోరెత్తించింది. అధికారపక్షానికి గట్టిపోటీ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో కాంగ్రెస్ (Congress) బలపరచిన అభ్యర్థులకు పోటాపోటీగా స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ఆధిక్యం ప్రదర్శించింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడతలో ఇప్పటికే ఏకగ్రీవమైన 396 సర్పంచ్ స్థానాలు, నామినేషన్లు దాఖలు కాని 5 స్థానా లు, హైకోర్టు స్టేతో నిలిచిన 1 స్థానం మినహాయించి మిగతా 3,834 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. అందు లో అధికార పక్షమైన కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులు ఏకగ్రీవంతో కలిపి మొత్తంగా 2,342 స్థానాలు గెలిచారు. బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థులు ఏకగ్రీవాలతో కలిపి 1,313 స్థానాల్లో విజయకేతనం ఎగరవేశారు. దాదా పు 387కుపైగా స్థానాల్లో ఇతరులు గెలుపొందగా, అందులోనూ 95 శాతానికిపైగా అభ్యర్థులు గులాబీ నేతలే కావడం గమనార్హం. సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రం లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల వైపే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని, అభ్యర్థి వ్యక్తిత్వాన్ని సైతం పరిగణనలోకి తీసుకుని ఓటు వేస్తారు. 2019 పంచాయతీ ఎన్నికల్లో తొలి విడతలో నాటి అధికారపక్షమైన బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థులే 80% స్థానా లు గెలచుకున్నారు. కానీ, ప్రస్తుత పంచాయతీ పోరులో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కోవడం గమనార్హం. అలవోకగా నెగ్గాల్సిన అధికారపక్షం బొటాబొటీ ఓట్లతో కొద్దిపాటి మెజారిటీని మాత్రమే సాధించగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థులు ఎక్కడికక్కడ పోటీ ఇచ్చారు. అధికార పక్షాన్ని వణికించారు. ఒకవైపు చేతిలో అధికారం ఉన్నది. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రచారం సాగించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ తమ నియోజకవర్గాల్లో మోహరించారు. గ్రామీణులను అనేకవిధాలుగా ప్రలోభాలకు గురిచేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన నేతలపై దాడులకు దిగారు. అక్రమ కేసులు బనాయించి నిర్బంధించారు. సామ, దాన, భేద, దండోపాయాలన్నీ ప్రయోగించారు. అయినప్పటికీ, పల్లెల అభిమానాన్ని పొందలేకపోయారు.
సిద్దిపేట, ఆసిఫాబాద్‌లో ఆధిక్యం
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత ఎన్నికల్లో సిద్దిపేట, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అధికార కాంగ్రెస్‌పై ప్రతిపక్ష బీఆర్ఎస్ పూర్తి ఆధిక్యం చాటుకున్నది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో తొలి విడతలో మొత్తంగా 163 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అందులో బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థులు అత్యధికంగా 84 స్థానాలను కైవసం చేసుకున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులు 57 చోట్ల మాత్రమే బొటాబొటీ మెజారిటీతో గెలిచి పరువు నిలుపుకున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ గులాబీ శ్రేణులు సత్తా చాటాయి. ఎమ్మెల్యే కోవా లక్ష్మి నేతృత్వంలో బీఆర్ఎస్ సైనికులు కాంగ్రెస్‌ను పంచాయతీ ఎన్నికల్లో నిలువరించారు. జిల్లాలో తొలి విడతలో 114 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అందులో బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థులు 43 స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ 33 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు సైతం అంతే సంఖ్యలో గెలువగా వారిలోనూ అత్యధికమంది గులాబీ మద్దతుదారులే కావడం గమనార్హం. మొత్తం గా ఈ రెండు జిల్లాల్లో కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం చాటుకున్నది.
11 జిల్లాల్లో ఢీ అంటే ఢీ
రాష్ట్రవ్యాప్తంగా 11జిల్లాలో కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అనేలా పోటీనిచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ గ్రామీణులను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయింది.