హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : మోదీ సర్కారు తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేఆర్ సురేశ్‌రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. మొదటి నుంచి బీఆర్ఎస్ ముస్లింల మనోభావాలను గౌరవిస్తున్నదని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇదే పంథాలో ముందుకెళ్తుందని పేర్కొన్నారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ బలం తక్కువగా ఉన్నప్పటికీ ప్రజాపోరాటంలో ముందున్నామని అన్నారు. ముస్లింలతోపాటు అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతున్న బీజేపీని పార్లమెంట్లో నిలువరించామని చెప్పారు.
అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో దుర్మార్గపు పాలన సాగిస్తున్నదని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను విస్మరించి ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులపై దాడులకు దిగుతున్నదని ధ్వజమెత్తారు. హెచ్‌సీయూలో జరిగిన అమానవీయ ఘటనలు, హైడ్రా ఆగడాలను రాజ్యసభలో చర్చకు తెచ్చామని చెప్పారు. అభివృద్ధి కోసం భూములను అమ్మడం సహజమేనని, కానీ ఎలాంటి భూములను అమ్మాలో నిర్ణయించడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందిలేని భూములను వేలం వేశారని, ఏనాడూ యూనివర్సిటీ భూముల జోలికి పోలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రియల్ ఎస్టేట్ బ్రోకర్లా వ్యవహరిస్తూ విలువైన స్థలాలను అమ్మకానికి పెట్టడం దుర్మార్గమని అన్నారు.