హైదరాబాద్, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): తెలంగాణ గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ అప్పనంగా తరలించుకుపోయే యత్నాలను బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. తొలినాళ్ల నుంచి ఇప్పటివరకు ఏపీతో ఎడతెగని పోరాటం కొనసాగిస్తున్నది. ఇదే దశలో అసలు స్పందించాల్సిన తెలంగాణ కాంగ్రెస్ సర్కారు చేష్టలుడిగి చూస్తున్నది. బీఆర్ఎస్ తొలుత స్పందిస్తూ ఏపీ చర్యలను వ్యతిరేకిస్తుండగా, కాంగ్రెస్ సర్కారు మాత్రం తీరిగ్గా ఆ తర్వాత స్పందిస్తూ వ్యతిరేకిస్తున్నట్టు డ్రామాలు చేస్తున్నదనే విమర్శలు ఉన్నాయి.
నాడు లేఖల నుంచి నేడు ఏపీ మంత్రి లోకేశ్ వ్యాఖ్యలను ఖండించడం వరకు బీఆర్ఎస్ వేగంగా స్పందిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత ఆలస్యంగా స్పందించడం గమనార్హం. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం బనకచర్ల నిర్మాణానికి తొలి అడుగు వేసిన సమయంలో బీఆర్ఎస్ వేగంగా స్పందించింది. గోదావరి జలాలను అక్రమంగా తరలించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి లేఖ రాశారు.
దీనిపై పలుమార్లు మీడియా సమావేశాల్లో తెలంగాణకు ఏపీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజల ముందు ఎండగట్టారు. ఆ తర్వాత వారం రోజులకు స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం హరీశ్‌రావు రాసిన లేఖల్లో తేదీలను మార్చేసి కేంద్రానికి లేఖలు రాసింది. ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అంటూ హడావుడి చేశారు. ఈ నేపథ్యంలో హరీశ్‌రావు కన్నా ముందే ఎందుకు స్పందించలేదని, లేఖ ఎందుకు రాయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి తీరుతామని, అనుమతులు ఏ విధంగా తెచ్చుకోవాలో తమకు తెలుసని, ఆ సత్తా టీడీపీకి ఉన్నదంటూ ఏపీ మంత్రి లోకేశ్ ఇటీవల సవాల్ విసిరారు. లోకేశ్ వ్యాఖ్యలపై వేగంగా స్పందించిన బీఆర్ఎస్.. ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు మరుసటిరోజు శుక్రవారం మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియా సమావేశంలో లోకేశ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఏపీ ప్రభుత్వ బనకచర్లను కట్టి తీరుతామంటే.. తాము అడ్డుకొని తీరుతామంటూ హరీశ్ ప్రతిసవాల్ విసిరారు. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం లోకేశ్ వ్యాఖ్యలపై స్పందించడంలోనూ వెనుకబడింది.
రెండురోజుల పాటు సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు ఒక్కరంటే ఒక్కరు కూడా అసలే స్పందించకపోవడం గమనార్హం. ఆయన వ్యాఖ్యలనూ ఖండించలేదు. గతంలో మాదిరిగా హరీశ్‌రావు స్పందించిన తర్వాత మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి స్పందించి లోకేశ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు కలరింగ్ ఇచ్చారు. అంటే ఏపీ మంత్రి లోకేశ్ మాట్లాడిన రెండురోజుల తర్వాత గానీ పాలకులకు జ్ఞానోదయం కాలేదా? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు కాంగ్రెస్‌కు తెలంగాణ సోయి లేదని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని, అందుకే ఆ పార్టీకి తెలంగాణపై ప్రేమ, ప్రజల కష్టాలపై సోయి ఉంటుందని, అందుకే తెలంగాణకు నష్టం జరిగే అంశాలపై వేగంగా స్పందిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.