హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)కు వ్యతిరేకంగా పోరాడేది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమేనని మాజీ మంత్రి మహముద్ అలీ అన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ పార్లమెంట్లో సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా కొట్లాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలను ఎక్కువ సంఖ్యలో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ మొదటి నుంచి సెక్యులర్ పార్టీగా ఉందని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీలకు అత్యధిక నిధులు కేటాయించారని, పెద్ద ఎత్తున మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. సీఎంగా కేసీఆర్ లేకపోవడంతో పేద, మధ్య తరగతి ముస్లింలు ఎంతో బాధపడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం మతసామరస్యానికి ప్రతీక అని, ఇక్కడ గంగా జమునా తహాజీబ్ సంస్కృతి ఉన్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి టీ పద్మారావు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, బీఆర్ఎస్ నాయకులు అక్బర్ హుస్సేన్, దాసోజు శ్రవణ్, మన్నె గోవర్థన్‌రెడ్డి, గడ్డం నగేశ్ తదితరులు పాల్గొన్నారు.