హైదరాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగా ణ): రాష్ట్ర ప్రభుత్వం జరిపించిన కులగణన సర్వే తప్పులతడకగా, కాకి లెకలతో అశాస్త్రీయంగా ఉన్నదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2011లో జరిపించిన లెకల ప్రకారం తెలంగాణ జనాభా 3 కోట్ల 50 లక్షల 03 వేల 674 కాగా, 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 3 కోట్ల 68 లక్షల 76 వేల 544, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సర్వేలో 3 కోట్ల 70 లక్షల 77 వేల 544గా నమోదైందని వివరించారు. పదేండ్లలో తెలంగాణ జనాభా కేవలం 2 లక్షలు మాత్రమే పెరిగిందని పేరొనడం విడ్డూరంగా ఉన్నదని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జరిపించిన సర్వే ప్రకారం బీసీలు (ముస్లిం బీసీలు కాకుండా) 52 శాతం అని నిర్ధారణ కాగా, ఇప్పుడు 46 శాతమేనని ప్రభుత్వం వెల్లడించడం దారుణమని పేర్కొన్నారు. తప్పుల తడక సర్వే నివేదికను మంత్రిమండలి ఆమోదించడం, చట్టసభల్లో ప్రవేశపెట్టి ప్రజలకు తప్పుడు సమాచారమిచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు.
కులగణన ప్రకారం రాష్ట్రంలో 56.33 శాతం బీసీలు ఉన్నట్టు తేలిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీటి ఆధారంగానే రిజర్వేషన్లు అమలుచేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. బీసీ కులగణనపై శాసనమండలిలో సభ్యులు లేవనెత్తిన సందేహాలపై ఆయన వివర ణ ఇస్తూ.. సెన్సెస్‌లో ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు మాత్రమే ఉంటాయని ఆయన చెప్పారు. 2011 జనాభా లెక్కల ఆధారం చేసుకొని రాజకీయంగా రిజర్వేషన్లు అమలుచేస్తామని స్పష్టంచేశారు.
బీసీ కులగణన తప్పుల తడకగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ విమర్శించా రు. రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1.40కోట్ల కుటుంబాలు ఉండగా, కులగణన సర్వేలో కేవలం 1.12 కోట్ల కుటుంబాలనే చూపడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బీసీ కులగణనపై శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3.18 కోట్ల మంది ఓటర్లుండగా, బీసీ కులగణన నివేదికలో గణనీయంగా తగ్గించడమేంటని ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు, 2011 జనాభా లెక్కల ఆధారంగా సమగ్ర కులగణన చేపట్టాలని విజ్ఞప్తిచేశారు.
టీజీపీఎస్సీ ఉద్యోగాల భర్తీని ఎస్సీ వర్గీకరణ ఆధారంగానే చేపట్టాలని కాంగ్రెస్ సభ్యు డు జీవన్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు ఉషా మెహ్రా కమిటీ సిఫారసులను ఆధారంగా చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. శాసన మండలిలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై ఆయన మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన తరువాత డెడికేషన్ కమిషన్ ఏర్పాటుచేయాల్సి ఉన్నదని సూచించారు. రిజర్వేషన్ ఫలాలు ఏ విధంగా కల్పించబోతున్నారో ప్రభుత్వం తెలుపాలని కోరారు.