హుస్నాబాద్, మే 9: ఆరు గ్యారెంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టించిందని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద గల షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటివరకు కరెంటు కోతల్లో, రైతుబంధు ఎగ్గొట్టడంలో, కేసీర్ కిట్ బంద్ చేయడంలో, కల్యాణలక్ష్మి రద్దు చేయడంలో నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంలో, రుణమాఫీని విస్మరించడంలో మాత్రం మార్పు తెచ్చిందని దుయ్యబట్టారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీల ముచ్చట మర్చిపోయి ఏ గుడికాడికి పోతె ఆ గుడి దేవుడిపై ఒట్టు వేస్తూ మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డివన్నీ ఝూటా మాటలని అన్నారు. రైతులకు బోనస్ లేదు, మహిళలకు రూ.2,500 లేవు, రుణమాఫీ లేదు, పింఛన్ పెంపులేదు, సంక్షేమ పథకాల అమలు చేయకుండా మభ్యపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్పాలని ప్రజలను కోరారు. దేవుడి పేరు చెప్పి బీజేపీ రాజకీయం చేస్తున్నదని విమర్శించారు.
ప్రధాని మోదీ వేములవాడకు వచ్చి దేవాలయ అభివృద్ధికి కనీసం నిధులు మంజూరు చేయకపోవడం, అభివృద్ధి చేస్తానని హామీ ఇవ్వక పోవడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఒక్క గుడికి, బడికి కూడా నిధులు మంజూరు చేయించలేదని విమర్శించారు. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతాడని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.