నాగర్‌కర్నూల్, మే 3: జిల్లాలను కుదిస్తే ప్రజల ఆందోళనలతో రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన నాగర్‌కర్నూల్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ 33 జిల్లాలు ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ జిల్లాలను తగ్గించాలన్న యోచన చేస్తున్నదన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలను రేవంత్ ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. ఎంపీ ఎన్నికల్లో ప్రాంతేతరుడైన మల్లు రవిని ఓడించాలని పిలుపునిచ్చారు. మత విభేదాలు సృష్టించే బీజేపీని ఓడించాలని కోరారు. కాంగ్రెస్ సర్కారు రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, అందుకే పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ ఉద్యమానికి రైతులు స్వచ్ఛందంగా మద్దతు పలుకాలని కోరారు. స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.