రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): రైతులకు గత డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే విస్మరించిందని, మళ్లీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడ్ నెపంతో ఆగస్టు 15న చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన కేవలం ఎన్నికల స్టంటేనని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు.
మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ భక్తులతో మాట్లాడి కరీంనగర్ తిరుగు ప్రయాణంలో ఇదే మండలంలోని అనుపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
వరికోతలు మొదలైనా అనేక చోట్ల ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదని చెప్పారు. సెంటర్లకు తెచ్చిన ధాన్యాన్ని ఎప్పుడు కొంటారో తెలియని పరిస్థితిలో క్వింటాకు రూ.1800 చొప్పున తక్కువ ధరకు అమ్ముకుని రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు. సెంటర్ల నుంచి ధాన్యం తరలించేందుకు మిల్లులకు అలాట్మెంట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
కొనుగోళ్లు ఆలస్యం చేస్తే విధిలేని పరిస్థితిలో రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకుని నష్టపోతారని, వెంటనే కొనుగోలు చేయాలని, కనీస మద్దతు ధరతోపాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాసంగి సీజన్ నుంచే బోనస్ ఇస్తామని చెప్పిన సీఎం ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వినోద్‌కుమార్‌తో సమస్యలు ఏకరువుపెట్టారు.
వరికోతలు కాగానే ధాన్యాన్ని సెంటర్లకు తెచ్చి ఆరబోసి పదిహేను రోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదంటూ అన్నదాతలు మొరపెట్టుకున్నారు. అకాల వర్షాలు పడితే ఎండిన వడ్లు మళ్లీ తడిసి ముద్దవుతాయన్న భయంతో తిండితిప్పలు లేక పొద్దంతా కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వినోద్‌కుమార్ వెంట జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఉమ్మడి జిల్లా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, జడ్పీటీసీ మ్యాకల రవి, బీఆర్ఎస్ నాయకులు బొల్లి రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.